పుణె: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించడం గర్వంగా ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ మ్యాచ్‌ను సొంతం చేసుకోవడంతో జట్టులో కొత్త జోష్ నెలకొందన్నాడు. ఆరంగేట్రం ఆటగాళ్లు కృనాల్ పాండ్య, ప్రసిద్ధ్‌లతో పాటు సీనియర్లు శిఖర్ ధావన్, భునవేశ్వర్, శార్దూల్, రాహుల్ తదితరులు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారన్నాడు. బెయిర్‌స్టో జోరును చూసి ఒక దశలో ఓటమి ఖాయమనిపిందన్నాడు. అయితే ఒత్తిడిని తట్టుకుంటూ కృనాల్, ప్రసిద్ధ్‌లు కీలక బౌలింగ్‌తో జట్టును ఆదుకున్నారన్నాడు. ఈ విజయం తమకు చాలా ప్రత్యేకమైందన్నాడు. ఇప్పటి వరకు ఆడిన చాలా సిరీస్‌లలో తొలి మ్యాచ్‌లో తమకు ఓటమి ఎదురైందన్నాడు. కానీ ఈసారి ఆ చెత్త రికార్డును తిరగరాయడం ఆనందం కలిగించిందన్నాడు. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టుతో పోరు ఎప్పుడూ కూడా హోరాహోరీగానే ఉంటుందన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు ఇంగ్లీష్ జట్టులో కొదవలేదన్నాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జట్టును ముందుకు నడిపించే అపార అనుభవజ్ఞుడైన సారథి మోర్గాన్ సేవలు ఇంగ్లండ్‌కు అందుబాటులో ఉన్నాయన్నాడు. అయినా కూడా వారిని ఓడించి సిరీస్‌లో శుభారంభం చేయడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నాడు. రానున్న మ్యాచుల్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తూ సిరీస్‌ను సొంతం చేసుకోవడమే తమ ముందున్న ఏకైక లక్షమని కెప్టెన్ కోహ్లి స్పష్టం చేశాడు. ఇక తొలి మ్యాచ్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ మిగతా మ్యాచ్‌లలో ఆడతాడా లేదా అనేది ఇంకా తేలలేదన్నాడు. అతను లేకున్నా ఆ లోటును భర్తీ చేసే ఆటగాళ్లు జట్టులో ఉండడం ఊరట కలిగించే అంశమన్నాడు.
ఇక, తొలి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ధ్ కృష్ణ ఆ తర్వాత అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చిన తీరును ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. ఇక కీలక సమయంలో కృనాల్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోవడం, రాహుల్ మళ్లీ గాడిలో పడడం టీమిండియాకు కలిసివచ్చే అంశాలని కోహ్లి అభిప్రాయపడ్డాడు.
I’m really proud to win in 1st ODI: virat kohli