విపరీతంగా సిగరెట్లు కాలుస్తుండే బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తాను ఎట్టకేలకు ఆ అలవాటు మానినట్లు వెల్లడించారు. ముంబయిలోని ఒక ఆడిటోరియంలో శనివారం తన 59వ జన్మదిన వేడుక నిమిత్తం సమీకృతమైన తన అభిమానులతో షారుఖ్ ఖాన్ తన తాజా ఆరోగ్య స్థితిని పంచుకున్నారు. తన ఫ్యాన్ క్లబ్ ‘ఎక్స్’లో పంచుకున్న ఆ కార్యక్రమం వీడియోలో షారుఖ్ మాట్లాడుతూ, ‘ఒక మంచి విషయం నేను ఇక ఏమాత్రం ధూమపానం చేయడం లేదు, మిత్రులారా! ధూమపానం మానిన తరువాత అంతగా ఊపిరి ఆడడంలేదని భావించబోనని అనుకున్నా, కానీ ఇప్పటికీ ఆ భావన ఉన్నది (సైడ్ ఎఫెక్ట్‌లు). ఇన్షాల్లా, అది కూడా సర్దుకుంటుంది’ అని అన్నారు.
2012లో తన జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) మధ్య ఐపిఎల్ మ్యాచ్ సమయంలో బాహాటంగా ధూమపానం చేసినందుకు షారుఖ్‌ను విమర్శించారు. కానీ జైపూక్‌లో ఒక కోర్టు ముందు తన తప్పును ఒప్పుకున్న తరువాత కేవలం రూ. 100 జరిమానాతో ఆయన తప్పించుకున్నారు. తన పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్‌రామ్ కోసం ధూమపానానికి, మద్యపానానికి స్వస్తి చెప్పాలని యోచిస్తున్నట్లు 2017లో ఒక కార్యక్రమంలో షారుఖ్ చెప్పారు. తాను కనీసం మరి పది సంవత్సాల పాటు అభిమానులను అలరించగలనని షారుఖ్ శనివారం కార్యక్రమంలో కూడా వాగ్దానం చేశారు.