షాహిన్ అఫ్రిదికి 8వ ర్యాంక్
అశ్విన్ రెండో ర్యాంక్ పదిలం
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు మెరుగైన ర్యాంక్‌లను సొంతం చేసుకున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో, చివరి టెస్టులో పది వికెట్లను పడగొట్టి పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన షాహిన్ అఫ్రిదికి తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానం దక్కింది. షాహిన్ ఏకంగా పది ర్యాంక్‌లను మెరుగు పరుచుకుని 8వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. సెంచరీ హీరో ఫవాద్ ఆలమ్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు కూడా తమ ర్యాంక్‌లను మెరుగు పరుచుకున్నారు. తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఫవాద్ ఆలమ్ 34 ర్యాంక్‌లను మెరుగు పరుచుకుని 21వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 848 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
టిమ్ సౌథి (కివీస్), జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా), నీల్ వాగ్నర్ (కివీస్) టాప్5 ర్యాంక్‌లలో నిలిచారు. ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆరో, కగిసో రబడా (దక్షిణాఫ్రికా) ఏడో ర్యాంక్‌ను సాధించారు. షాహిన్ అఫ్రిది 8వ ర్యాంక్‌ను దక్కించుకోగా జాసన్ హోల్డర్ (విండీస్), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) టాప్10 ర్యాంక్‌లలో నిలిచారు. ఇక బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ (901) రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రెండో, స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), లబూషేన్ (ఆస్ట్రేలియా)లు తర్వాతి ర్యాంక్‌లలో నిలిచారు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదో, రోహిత్ శర్మ ఆరో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి 8వ ర్యాంక్‌కు పడిపోయాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని 7వ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా)లు కూడా టాప్10 ర్యాంకింగ్స్‌లో నిలిచారు.