న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ తన వారసుడిగా తన కుమారుడు సయ్యద్ షాబన్ బుఖారీని ప్రకటించారు. మసీదులోని ్రఆవరణలో దస్తర్‌బందీ(పట్టాభిషేక) మహోత్సవం జరిగింది. ఆదివారం ఉత్సవానికి ప్రారంభం ముందు బుఖారీ తన వారసుడిని లాంఛనంగా ప్రకటించారు. మసీదు చరిత్రను వివరించిన బుఖారీ మొదటి షాహీ ఇమామ్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నియమించారని గుర్తు చేశారు. జామా మసీదు మొదటి ఇమామ్ హజ్రత్ సయ్యద్ అబ్దుల్ ఘఫూర్ షా బుఖారీని ఆయన 63వ ఏట షాహీ ఇమామ్‌గా నియమించారని బుఖారీ తెలిపారు.
ఆనవాయితీ ప్రకారం తాము జీవించిఉన్నపుడే తమ వారసులను షాహీ ఇమామ్‌లు ప్రకటించారని ఆయన తెలిపారు. 400 ఏళ్లకు పైగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని అనుసరించి తన వారసుడిగా తన కుమారుడిని ప్రకటిస్తున్నట్లు బుఖారీ తెలిపారు. తన మరనానంతరం లేదా అనారోగ్యం పాలైన పక్షంలో జామా మసీదు 14వ షాహీ ఇమామ్‌గా సయ్యాద్ షాబాన్ బుఖారీ బాధ్యతలు చేపడతారని సయ్యద్ అహ్మద్ బుఖారీ ప్రకటించారు. అనంతరం ఇస్లామిక్ పండితులు, ఇతర ప్రముఖుల సమక్షంలో దస్తర్‌బందీ(తలపాగా) ధారణ ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో షాజహాన్ నిర్మించిన అతి పెద్ద జామా మసీదు ఆవరణలో ఈ కార్యక్రమం గంటకు పైగా సాగింది.