Thursday, January 23, 2025

భక్తులతో కిటికిటలాడిన శైవక్షేత్రాలు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటికిటలాడాయి. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని కార్తీక దీపారాధన చేశారు. విశేష సంఖ్యలో భక్తులు వస్తుండటంతో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కార్తీక సోమవారం పరమశివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో విశేష సంఖ్యలో భక్తులు శివాలయాలను దర్శించుకొని దీపాలను వెలిగిస్తున్నారు. మూడో కార్తీక సోమవారం ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శివలాయాలు భక్తులతో పోటెత్తాయి.

ఉదయాన్నే భక్తులు శైవక్షేత్రాలకు వెళ్లి కార్తీకదీపారాధన గావించారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాజన్న దర్శనానికి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. వేములవాడ రాజన్న దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టింది. మూడో కార్తీక సోమవారం సందర్భంగా అన్ని ఆలయాల ఎదుట భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల క్యూ…

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేస్తున్నారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామి వారి అలంకార దర్శనానికే భక్తులను అనుమతిస్తున్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి, కపిలతీర్తం సహా ఇతర శైవాలయాలు భక్తులతో నిండిపోయాయి. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. అన్నవరం సత్యదేవుడి ఆలయంలో అర్ధరాత్రి నుంచే వ్రతాలు, దర్శనాలు ప్రారంభమయ్యాయి. రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడాయి. పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతిమి ఘాట్లలో పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News