న్యూఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రధాని నరేంద్ర మోడీకి రెండవ ప్రిన్సిపల్ కార్యదర్శిగా శనివారం నియుక్తుడయ్యారు. గుజరాత్ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఎఎస్ అధికారి పికె మిశ్రా ప్రస్తుతం ప్రధానికి ప్రిన్సిపల్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక అధికారిక ఉత్తర్వు ప్రకారం, తమిళనాడు కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఎఎస్ అధికారి శక్తికాంత దాస్ పదవీకాలం ప్రధాని పదవీ కాలంతో పాటు లేదా తిరిగి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు, ఏది ముందైతే అది ముగుస్తుంది.
‘ప్రధానికి ప్రిన్సిపల్ కార్యదర్శి2గా ఐఎఎస్ (రిటైర్డ్) శక్తికాంత దాస్ నియామకానికి మంత్రివర్గ నియామకాల కమిటీ ఆమోదించింది.దాస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పదవీ కాలం సాగుతుంది. ఆయన నియామకం ప్రధాని పదవీ కాలంతో లేదా తిరిగి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు, ఏది ముందైతే దానితో ముగుస్తుంది’ అని ఆ ఉత్తర్వు తెలియజేసింది. దాస్ 42 ఏళ్లకుపైగా విశిష్ట సేవలు అందించారు. ఆయన ప్రధానంగా ఆర్థిక, పన్నులు, పెట్టుబడి, మౌలిక వసతుల కల్పన రంగాల్లో సేవలు అందించారు. ఆర్‌బిఐ 25వ గవర్నర్ అయిన శక్తికాంత దాస్ భారత్ జి20 షెర్పాగా, 15వ ఆర్థిక సంఘం సభ్యునిగా కూడా వ్యవహరించారు.