లండన్: ఆర్‌బిఐ(భారతీయ రిజర్వ్ బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు. బుధవారం లండన్‌లో జరిగిన సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్ 2023లో ఆయనకు ఈ గౌరవం లభించింది. సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్ 2023 విజేతలను ఈ ఏడాది మార్చి చివరిలో ప్రకటించారు. రెండు టాప్ ప్రైజ్‌ల్లో నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఉక్రెయిన్‌కు ‘2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇయర్’, అలాగే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన శక్తికాంత దాస్‌కు ‘గవర్నర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కాయి.
కోవిడ్ మహమ్మారి సమయంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభంలో భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అదే సమయంలో ఆయన ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలోనూ విజయం సాధించారు. శక్తికాంత దాస్ పేమెంట్ ఇన్నోవేషన్ సిస్టమ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. నిర్వాహకుల ప్రకారం, ఆర్‌బిఐ గవర్నర్ కష్టతరమైన సంస్కరణలను ధైర్యంగా అమలు చేశారని, దీంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కూడా ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.