Friday, November 22, 2024

మరిచిపోలేని గొప్ప బహుమతి ‘శాకుంతలం’

- Advertisement -
- Advertisement -

Shakuntalam movie Pooja Ceremony in Hyderabad

డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ ఆదిపర్వంలోని ఆహ్లాదకరమైన ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శాకుంతలం’. సమంత అక్కినేని శకుంతలగా టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో డిఆర్‌పి, గుణ టీమ్ వర్క్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, దిల్‌రాజు కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ.. “దిల్‌రాజులాంటి మేకర్ ప్రాత్సాహం ఉంటే ఆ సినిమా మేకింగ్, నిర్మాణ విలువలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. దిల్ రాజు నాతో చేతులు కలపడం ఎంతో ఆనందంగా ఉంది. నా ప్రథమ పుత్రిక నీలిమ గుణ ఈ మూవీతో నిర్మాతగా పరిచయమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక శకుంతల పాత్ర కోసం సమంత పేరును అందరూ సూచించారు. ఆమె ఈ కథ వినగానే వెంటనే ఓకే చెప్పారు. ఇక దుష్యంతుడిగా దేవ్ మోహన్‌ని కూడా నీలిమనే ఎంపిక చేసింది. కథ గురించి అంతా తెలుసుకుని ఆయన ఓకే చెప్పారు. వీరిద్దరూ సినిమాకు కావాల్సిన గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం… ఇలా అన్నీ నేర్చుకున్నారు. రేపు వీరిద్దరూ సినిమాలో శకుంతలా? దుష్యంతుడా? అనేలా పోటాపోటీగా ఉంటారు”అని అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “శాకుంతలం లాంటి హిస్టారికల్ సినిమాను తీయడం మామూలు విషయం కాదు. సమంత ఇదివరకే కథకు ఓకే చెప్పింది కాబట్టి.. గుణ శేఖర్ కథ చెప్పేటప్పుడే సమంతను శకుంతలగా ఊహించుకున్నాను. కథలో అన్ని ఎమోషన్స్ బాగా కుదిరాయి. చాలా సన్నివేశాలు అదిరిపోయాయి. సినిమాను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్తానని గుణశేఖర్ అన్నారు. 2022లో ఈ మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం”అని తెలిపారు. స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మాట్లాడుతూ “నాకు ఎప్పుడూ ఓ చిన్న బాధ ఉండేది. నేను కొన్ని పాత్రలు పోషించలేనేమోనని అనుకున్నాను. రొమాంటిక్, విలన్, యాక్షన్ ఇలా అన్ని పాత్రలు చేశాను. కానీ నా డ్రీమ్ రోల్ అయిన రాజకుమారి పాత్రను చేయాలని అనుకున్నాను. నా కెరీర్‌లో ఇలాంటి సమయంలో శకుంతల పాత్ర ఇవ్వడం మరిచిపోలేని గొప్ప బహుమతి. దిల్ రాజు, గుణ శేఖర్ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. గుణ శేఖర్ ప్రతీ సీన్‌ను అద్భుతంగా చెప్పారు”అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో చిత్ర నిర్మాత నీలిమ గుణ, హీరో దేవ్ మోహన్ పాల్గొన్నారు.

Shakuntalam movie Pooja Ceremony in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News