Friday, November 22, 2024

సిగ్గు సిగ్గు!

- Advertisement -
- Advertisement -

కొన్ని సందర్భాలు లేదా ఘటనలు మనం ముందుకు పోతున్నామా, వెనక్కు వెళుతున్నామా అనే సందేహాన్ని గట్టిగా కలిగిస్తాయి. ఇతరత్రా ఏమన్నా కానీయండి, దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేయనీయండి, ధరల మంటల మీద అదే పనిగా కిరసనాయిలు పోస్తూ పోనీయండి, ఇంకెన్ని దుర్భర పరిస్థితులను దేశంలో కలిగించినా భరిద్దాం, కాని సాటి మనుషులను పురుగుల కంటే హీనంగా చూడడాన్ని కూడా స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ళ తర్వాత, సర్వసమతా రాజాంగాన్ని ఆవిష్కరించుకొన్న ఇంత కాలం అనంతరం నిస్సహాయంగా, నిస్సిగ్గుగా, మౌనంగా మోయడమేనా? ఎందుకిలా, ఎన్నాళ్ళిలా అనే ఆవేదనా పూరితమైన ప్రశ్నను కూడా లోలోపలా కుక్కుకుందామా? కుక్కుకొని, భారతీయులుగా బతుకుతున్నందుకు ఆనంద పారవశ్యంలో మునుగుదామా?

మధ్యప్రదేశ్‌లో ఒక ఆదివాసీపై బిజెపి నాయకుడు ఒకరు మూత్రం పోసిన ఘటన మరపున పడక ముందే ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగి ఒకరు కరెంటు పోయిందనో, మరే అభ్యర్థన మీదనో తన వద్దకు వచ్చిన ఒక దళితుడి చేత తన చెప్పులు నాకించిన వార్త ఎవరికైనా ఆగ్రహాన్ని కలిగించక మానదు. భూమ్మీద మానవులందరూ సమాన సామాజిక హోదాతో సహజీవనం చేయడమే ఆధునిక ప్రజాస్వామ్య నీతిగా వర్ధిల్లవలసి వుంది. అందుకు విరుద్ధంగా ఒకరినొకరు హీనంగా చూసుకుంటూ, బలహీనులను బలవంతులు వేపుకొని తింటూ వెనకటి అమానుష యుగాల్లోకి వెళ్ళిపోడమే కర్తవ్యంగా, లక్షంగా ఏ జాతి అయినా అడుగులు వేస్తుందా? ఇది పురోగామి దృక్పథం అవుతుందా? ఇదే అసలు సిసలైన భారతీయత అని దేశాన్ని పాలిస్తున్న కాషాయ పాలకులు మనలను నమ్మమంటారా? గత వారం మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ప్రవేశ్ శుక్లా అనే భారతీయ జనతా పార్టీ నాయకుడు సిగరెట్టు కాల్చుకొంటూ దశమత్ రావత్ అనే 36 ఏళ్ళ ఆదివాసీ వ్యక్తి ముఖం మీద మూత్రం పోశాడు. ఈ ఘటన వీడియో దృశ్యం వైరల్ కావడంతోనే ఇండోర్‌లోని దళితులు, ఆదివాసీలు నిరసన ప్రదర్శనలు జరిపారు.

ప్రవేశ్ శుక్లా దేశమంతటికీ అపఖ్యాతి తీసుకొచ్చాడని, ఆయనకు తీవ్రమైన శిక్ష వేయాలని, వీలైతే ఉరి తీయాలని కూడా వారు కోరారు. దానితో ఆదివాసీల ఆగ్రహానికి గురి అవుతామనే భయంతో వణికిపోయిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అత్యాచారానికి గురైన ఆదివాసీని పిలిపించి (ఇతడు అసలు బాధితుడు కాదంటున్నారు) ఆయన కాళ్ళు కడిగి క్షమాపణలు కోరారు. కొంత ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ప్రవేశ్ శుక్లా ఇంటిని బుల్డోజర్‌తో పాక్షికంగా ధ్వంసం చేయించారు. సమాజంలో పేట్రేగిన కుల దురహంకారానికి తమ పార్టీ ఏమేరకు కారణమో, దానిని నిర్మూలించడం ఎలాగో ఆలోచించకుండా వెంటనే శుక్లా ఇంటిని ధ్వంసం చేయించడం చౌహాన్ ప్రభుత్వం చేసిన మరో తప్పు. చట్ట ప్రకారం నిందితుడికి తగిన శిక్ష పడేలా చేయడానికి గట్టిగా కృషి చేయవలసిన ప్రభుత్వాధినేతలు అత్యుత్సాహంతో ఇటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడడం సమర్థించదగిన విషయం కాదు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీలపై హిందుత్వ వాదులు జరిపించిన అకృత్యాల గురించి తెలిసిందే. 2015లో ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో రాత్రి 10 గం॥ ల వేళ గొడ్డు మాంసాన్ని దాచుకొన్నారని, దానిని ఆరగిస్తున్నారనే వదంతుల ఆధారంగా 50 ఏళ్ళ మొహమ్మద్ అఖ్లాక్ అనే వ్యవసాయ కార్మికుడి ఇంటిపై మూక దాడి చేసి అతడిని హతమార్చిన ఘటన ఇంకా మరుపున పడలేదు. తాము ఏ నేరమూ చేయలేదని ఆ ఇంటిలోని వారంతా ప్రాధేయపడుతున్నా వినకుండా అఖ్లాక్‌ను చంపివేశారు.

ఇలాంటి ఘటనలు ఆ తర్వాత కూడా జరిగాయి. ఆవులను కబేళాలకు తీసుకు వెళుతున్నారనే నింద వేసి మార్గ మధ్యంలో దాడి చేసి హతమార్చిన ఘటనలు జరిగిపోయాయి. దళితులపై దౌర్జన్యాలు, అత్యాచారాల కేసుల్లో అత్యధికంగా దాదాపు 26% ఉత్తరప్రదేశ్‌లోనే సంభవించాయి. తర్వాత స్థానంలో 14.7 శాతంతో రాజస్థాన్, 14.1శాతంతో మూడో స్థానంలో మధ్యప్రదేశ్ వున్నాయి. ఆ తర్వాత 11.4శాతంతో బీహార్ వుండగా, 4.5 శాతంతో ఒడిశా వుండడం గమనార్హం. ఇలాంటి నేపథ్యంలోని ఉత్తరాది, బిజెపి కంచుకోట కావడం ఆశ్చర్యపడవలసినది కానేకాదు. కేవలం బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇటువంటి ఘటనలు మితిమించి జరగడం గమనించవలసిన విషయం. అవి పోయి ఇప్పుడు నీచాతినీచంగా ఆదివాసీలు, దళితుల ఆత్మగౌరవాన్ని బూటు కాళ్ళకింద రాసే అమానవీయ చర్యలు మొదలు కావడం అత్యంత ఆందోళనకరం. ప్రధాని, కేంద్ర హోం మంత్రి వంటి పెద్దలు ఇటువంటి దుర్ఘటనలను బహిరంగంగా ఖండిస్తే అవి తగ్గు ముఖం పట్టే అవకాశాలు తెరుచుకొంటాయి. కాని జాతీయ స్థాయి బిజెపి నాయకులే ముస్లింలపై చేయకూడని వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ప్రధానిది, కేంద్ర హోం మంత్రిది మౌనమే సమాధానంగా వున్న సందర్భాలను చూశాము. ఇప్పుడు సైతం వారి నుంచి అంతకు మించి ఆశించలేము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News