Wednesday, April 2, 2025

టీమిండియాకు భారీ షాక్!

- Advertisement -
- Advertisement -

గాయంతో షమీ ఔట్?
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాపై తొలి విజయంతో జోరుమీదున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. పాకిస్థాన్‌తో జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్ షమికి గాయం తిరగబెట్టినట్టు తెలుస్తోంది. మ్యాచ్ ఆరంభంలోనే షమీ మైదానం వీడాడు. తొలి స్పెల్‌లో మూడు ఓవర్లు మాత్రమే వేసిన షమీ 13 పరుగులు ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో నాలుగో బంతి వేసిన అనంతరం షమీ నొప్పితో బాధపడ్డాడు. దాంతో మైదానంలోకి ఫిజియోలు రాగా.. చీల మండ ప్రదేశంలో నొప్పిగా ఉన్నట్లు వారికి షమీ సూచించాడు. ఈ ఓవర్‌ను పూర్తి చేసిన అనంతరం షమీ నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు.

షమీ చీలమండ గాయంతో 15 నెలల పాటు భారత జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో చివరిసారిగా ఆడిన అతను అనంతరం చీలమండ గాయానికి శస్త్ర చికిత్స తీసుకున్నాడు. పూర్తిగా కోలుకొని మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు. ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన టి20తో సిరీస్‌లో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సిరీస్‌లో రాణించి ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టుకు ఎంపికయ్యాడు. అదే జోరుతో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. దాంతో షమీ ఫామ్‌లోకి వచ్చాడని అంతా అనుకున్నారు. పాక్‌తో మ్యాచ్‌లోనూ అదేతరహాలో బౌలింగ్ చేశాడు. షమీ వేసిన మూడు ఓవర్లకు పాక్ బ్యాటర్లు 13 పరుగులే రాబట్టారు. తొలి ఓవర్‌లో ఐదు వైడ్స్ వేసినా.. తర్వాతి రెండు ఓవర్లలో లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. కానీ గాయం తిరగబెట్టడంతో అసౌకర్యానికిగురైన అతను మైదానం వీడాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News