స్టాండ్ బైలుగా శార్దూల్, సిరాజ్
ముంబై: ఆస్ట్రేలియా వేదికగా జరిగే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియాలో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమికి చోటు దక్కింది. గాయపడిన స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో షమికి స్థానం లభించింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా సిరీస్ సమయంలో షమి కరోనా బారిన పడ్డాడు. దీంతో అతను ఆ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో షమిని ప్రపంచకప్ జట్టులో స్థానం కల్పించారు. అంతకుముందు వరల్డ్‌కప్‌కు షమి స్టాండ్ బై ఆటగాడిగా ఎంపికైన విషయం తెలిసిందే. కాగా గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరమయ్యాడు.
దీంతో సీనియర్ బౌలర్‌గా షమిని మెగా టోర్నీకి ఎంపిక చేశారు. త్వరలోనే షమి టీమిండియాతో జతకలుస్తాడు. ఇక హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌లను ప్రపంచకప్‌కు స్టాండ్ బై క్రికెటర్లుగా ఎంపిక చేశారు. స్టాండ్ బైగా ఉన్న షమి ప్రధాన జట్టులో చోటు సంపాదించగా, దీపక్ చాహర్ గాయంతో వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. దీంతో వీరి స్థానాల్లో సిరాజ్, శార్దూల్‌లను ఎంపిక చేశారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్‌లను ప్రపంచకప్ కోసం రిజర్వ్ ఆటగాళ్లుగా తీసుకున్నారు. కాగా భారత్ ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 23న జరుగనుంది.