రేప్ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదుపై స్టే
న్యూఢిల్లీ: మహిళపై అత్యాచార ఆరోపణల కేసులో బిజెపి నాయకుడు షానవాజ్ హుస్సేన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే ఇచ్చింది. తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ షానవాజ్ హుస్సేన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం దీనిపై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి సెప్టెంబర్ మూడవ వారానికి కేసు విచారణను వాయిదా వేసింది. ఢిల్లీకి చెందిన ఒక మహిళ తనపై అత్యాచారానికి పాల్పడిన షానవాజ్ హుస్సేన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ 2018లో ఢిల్లీలోని దిగువ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన దిగువ కోర్టు హుస్సేన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని గతంలో పోలీసులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ హుస్సేన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆగస్టు 17న ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.