బీజింగ్: షాంఘై నగరంలో రెండునెలలుగా అమలవుతున్న తీవ్రమైన కొవిడ్ ఆంక్షలను గత రాత్రి నుంచి సడలించడంతో ప్రజలు స్వేచ్ఛగా తిరిగి తమ జీవనాన్ని ప్రారంభించారు. షాంఘైలో సుమారు 2.5 కోట్ల జనాభా ఉంది. అయితే దీంట్లో 6.50 లక్షల మంది తమ ఇళ్లకే పరిమితం కానున్నారు. ఎందుకంటే ఇంకా కొవిడ్ కేసులు వ్యాప్తిలో ఉన్నాయి. ప్రస్తుతం చైనా ప్రభుత్వం జీరో కొవిడ్ విధానాన్ని అవలంబిస్తోంది. కొవిడ్ సోకిన వారు క్వారంటైన్ లో ఉండాలి లేదా ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. కొవిడ్ సోకిన వారి సమీప వ్యక్తులను కూడా తక్షణం పరీక్షిస్తున్నారు.
అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లే వాళ్లు కచ్చితంగా కొత్త నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. తమ స్మార్ట్‌ఫోన్లపై గ్రీన్ హెల్త్ కోడ్‌ను చూపిస్తేనే ఇంటి ఆవరణ లేదా భవనాన్ని దాటేందుకు అనుమతి ఉంటుంది. ప్రజారవాణా వ్యవస్థను వాడాలన్నా , లేక బ్యాంకులకు వెళ్లాలన్నా, మాల్స్‌కు పోవాలనుకున్నా, కచ్చితంగా 72 గంటల లోగా, తీసిన నెగిటివ్ పిసిఆర్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. మరో పట్టణానికి వెళ్లి వచ్చిన వారు 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలి. బుధవారం నుంచి బస్సులు, రైళ్లు తిరిగి నడుస్తున్నాయి. స్కూళ్లు పాక్షికంగా తెరవబడ్డాయి. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, స్టోర్లు, డ్రగ్‌స్టోర్లు 75 శాతం సామర్థం మించకుండా తెరుస్తున్నారు. ఎవరైనా వెళ్లాలనుకుంటే పాస్‌లు పొందాలి. సినిమాలు, జిమ్స్ మూతపడే ఉన్నాయి. విదేశీ కంపెనీలు తెరవడానికి మరో వారం ఆగాలి. షాంఘై రేవులో తిరిగి 85 శాతం వరకు ఆపరేషన్ ప్రారంభమైంది.
Shanghai eases Covid 19 Lockdown Restrictions