కరోనా కట్టడికి చైనా తీవ్రయత్నం.. బీజింగ్‌లో 2.1 కోట్ల మందికి పరీక్షలు
షాంఘైలో నిత్యం 50 మంది మృతి
బీజింగ్ : కరోనా కట్టడికి చైనా తీవ్రంగా యత్నిస్తోంది. ముఖ్యంగా బీజింగ్ నగరంలో కరోనా మహమ్మారి చెలరేగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం నాడు 35 లక్షల మంది కరోనా పరీక్షలు చేయగా, 21 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. నగరంలో మొత్తం కేసుల సంఖ్య 155కి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మహానగరం లోని 2.1 కోట్ల మందికి కొవిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు 38 కరోనాపాజిటివ్ కేసులకు సీక్వెన్సింగ్ చేపట్టగా, వాటన్నింటిలో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించినట్టు అక్కడి వైద్య అధికారులు వెల్లడించారు. కరోనా పెరుగుతుండటంతో బీజింగ్ వాసులకు లాక్‌డౌన్ భయం పట్టుకుంది. ఇప్పటికే నాలుగు వారాలుగా షాంఘై ప్రజలు లాక్‌డౌన్ లోనే ఉండిపోవడంతో అలాంటి ఆంక్షలు ఇక్కడా అమలు చేస్తారనే ఆందోళన నెలకొంది. దీంతో నిత్యావసర వస్తువులను సమకూర్చుకునేందుకు మార్కెట్ల వద్ద క్యూ కడుతున్నారు. అయితే డిమాండ్‌కు సరిపడా సరకులను అందుబాటులో ఉంచుతున్నట్టు బీజింగ్ అధికారులు వెల్లడిస్తున్నారు. మరోవైపు షాంఘైలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ మొత్తం 5 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుతున్నా కొవిడ్ మరణాలు కలవరపెడుతున్నాయి. సోమవారం ఒక్క రోజునే మరో 52 మంది మృతి చెందారు. దీంతో నగరంలో కొవిడ్ మృతుల సంఖ్య 190 కి చేరింది.