న్యూఢిల్లీ : ఎన్‌సిఇఆర్‌టి కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందించే కమిటీలోకి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధామూర్తి, సంగీత దర్శకులు శంకర్ మహాదేవన్, ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ వంటి ప్రముఖులకు చోటు కల్పించారు. వీరు కాకుండా మరో 16 మందిని ఈ కమిటీలోకి తీసుకున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. సరికొత్త సిలబస్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈ జాతీయ విద్యా శిక్షణా విషయాల పరిశోధనా సంస్థ ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాలు, ఇతర బోధన అధ్యయన ప్రక్రియలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ అత్యంత కీలకమైన విషయంలో ఇప్పుడు ఏర్పాటు అయిన కమిటీ పుస్తకాలను సమగ్ర రీతిలో ఉండే పాఠ్యాంశాలతో సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇతరత్రా విద్యాబోధనా మెటిరియల్‌ను కూడా సంస్థకు అందించాల్సి ఉంటుంది. మొత్తం 19 మందితో కూడిన ఈ నేషనల్ సిలబస్ అండ్ టీచింగ్ లర్నింగ్ మెటిరియల్ కమిటీ(ఎన్‌ఎస్‌టిసి)కి జాతీయ విద్యా ప్రణాళిక, నిర్వహణ సంస్థ (ఎన్‌ఐఇపిఎ) ఛాన్సలర్ మహేశ్ చంద్రపంత్ సారధ్యం వహిస్తారు.
మూడవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకూ విద్యార్థులకు అవసరం అయిన పుస్తకాలను ఈ కమిటీ వెలువరించాల్సి ఉంటుంది. ఎన్‌ఎస్‌టిసికి ఈ పుస్తకాల రూపకల్పనలో పలు బృందాల నుంచి వివిధ స్థాయిలో సహకారం అందుతుంది. ప్రత్యేకించి సిలబస్ సంబంధిత బృందాలు ప్రాధమిక విద్యాస్థాయిల్లో ఉండే ఆవశ్యకతలను గుర్తిస్తాయి. బోధనా అధ్యయన సరంజామాను ప్యానెల్‌కు అందిస్తాయి.దేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలుకు ఇప్పటికే ఇప్పటికే కె కస్తూరి రంగన్ ఆధ్వర్యపు స్టీరింగ్ కమిటీ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఎన్‌సిఎఫ్ ఎస్‌ఇ)ని సిద్ధం చేసింది. దీనిని విశ్లేషించుకుని ఇప్పుడు ఏర్పాటు అయిన కమిటీ వ్యవహరించాల్సి ఉంటుంది. కొత్త కమిటికి ప్రిన్సెంటెన్ వర్శిటీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్ మంజుల్ భార్గవ్ సహ అధ్యక్షులుగా ఉంటారు. మిగిలిన సభ్యులలో గణితశాస్త్రవేత్త సుజాత రందోరై, బ్యాడ్మింట్మిన్ ప్లేయర్ యు విమల్ కమార్, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ ఛైర్‌పర్సన్ ఎండి శ్రీనివాస్,
భారతీయ భాషా సమితి ఛైర్‌పర్సన్ ఛామూ కృష్ణ శాస్త్రి ఉంటారు. ఇటీవలి కాలంలో ఎన్‌సిఇఆర్‌టి టెక్ట్‌బుక్స్ నుంచి పలు అంశాలను, అధ్యాయాలను తొలిగించడం వివాదాస్పందం అయింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా పాఠ్యాంశాలకు కొత్త రంగు వేస్తోందని, వీటిలో కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఇతర విపక్షాలు ఆగ్రహిస్తున్నాయి.