న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ లోని జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద, శివానంద యోగ విద్యాపీఠం వ్యవస్థాపకులైన స్వామి గోవిందానంద సరస్వతిపై ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. ప్రతివాదికి నోటీసులు జారీ చేస్తూ ఆగస్టు 29కి విచారణ వాయిదా వేసింది. జులై 21న గోవిందానంద ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి అవిముక్తేశ్వరానందపై అనేక ఆరోపణలు చేశారు. దొంగబాబా అని కూడా వ్యాఖ్యానించారు. వారణాసి న్యాయస్థానం ఆయనపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందన్నారు.
ఈ నేపథ్యంలో అవిముక్తేశ్వరానంద ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనికి న్యాయమూర్తి నవీన్ చావ్లా స్పందిస్తూ “ ఇది మంచి పద్ధతి కాదు. ఆయన కొంచెం ఆవేశానికి లోనై ఉంటారు. దీనిలో పరువు నష్టం ఉందని అనుకోము” అని వ్యాఖ్యానించారు. “ మీరు సాధువై ఉండి ఈ విషయంపై ఎందుకు ఆందోళన చెందుతున్నారు? మీలాంటివారు వీటిని పట్టించుకోకూడదు. ఇలాంటి వాటితో మిమ్మల్ని కించపర్చలేరు. సాధువులు తమ పనుల తోనే గౌరవాన్ని పొందుతారు.” అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
స్వామి గోవిందానంద తమ క్లయింట్‌ను ‘దొంగ బాబా ’ అన్న విషయాన్ని అంతకు ముందు అవిముక్తేశ్వరానంద న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. “ ప్రజలను అపహరిస్తున్నట్టు, హిస్టరీ షీటర్ అని, రూ.7000 కోట్ల బంగారాన్ని దొంగిలించినట్టు , సాధ్వీలతో సంబంధాలు పెట్టుకొన్నట్టు పలు క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ ” గోవిందానంద ఆరోపించారని కౌన్సిల్ పేర్కొంది. ఇదిలా ఉండగా, అవిముక్తేశ్వరానంద ఇటీవల కాలంలో కేదార్‌నాథ్ ఆలయంలో 225 కిలోల బంగారం మాయమైందని, అయోధ్య రామాలయంలో జరిగిన కార్యక్రమంలో లోపాలు ఉన్నాయని, పలు ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. అప్పట్లో ఆయన సినీనటి కంగనా రనౌత్ సహా గోవిందానంద సరస్వతి తదితర పలువురు విమర్శించారు.