హైదరాబాద్: మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని శాంత బయోటెక్ రోడ్డు విస్తరణ పనులను ఐటిఐ వద్ద మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను మించిన రాష్ట్రం లేదన్నారు. కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు బంధు, రైతు భీమాలు ఏ ఒక్క బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో లేవన్నారు. దళితుల అభ్యున్నతికి దళిత బంధు దోహదపడుతుందని, డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం కృషి చేస్తామని చెప్పారు. శాంత బయోటెక్ రోడ్డును డబల్ రోడ్డుగా విస్తరిస్తామని పేర్కొన్నారు.
అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజల అవసరాలకనుగుణంగా పని చేయటం సిఎం కెసిఆర్ అభిమతమన్నారు. తెలంగాణలో 80 శాతం ఉన్న రైతులకు రైతు బంధు, 24 గంటల విద్యుత్, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి నకిలీ విత్తనాలపై ఉక్కుపాదంతో రైతన్నలకు ప్రభుత్వం అండగా ఉందన్నారు.పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు, యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తుందన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 2వేల కోట్ల పై చిలుకు నిధులతో కార్పొరేషన్ లు, మునిసిపాలిటీల అభివృద్ధి చేస్తుందని మంత్రి చెప్పారు. మేడ్చల్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ ప్రభుత్వం ఎస్సి, ఎస్టి, బిసి మైనార్టీలు, పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం నగరానికి శివారులో ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3 ఆస్పత్రుల నిర్మాణానికి సిఎం కెసిఆర్ గారు నిర్ణయించారని చెప్పారు.
Shantha Biotechnics Road widening works inaugurate at ITI