Monday, January 20, 2025

అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను చేయండి: సిఎస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల ముగింపు రోజున (జూన్ 22) అమరవీరుల స్మారక స్థూపాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రారంభ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ సమీక్ష నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి డిజిపి అంజనీ కుమార్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతికుమారి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన సాయంత్రం సిఎం కెసిఆర్ అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రారంభిస్తారని, అనంతరం సభా కార్యక్రమం ఉంటుందని ఆమె తెలిపారు. అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభానికి ముందు నెక్లెస్ రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్మారక కేంద్రం వరకు దాదాపు ఐదు వేల మంది కళాకారులచే ర్యాలీ ఉంటుందన్నారు. దాదాపు గంటన్నర సేపు ఈ ర్యాలీ కొనసాగుతుందని ఆమె తెలిపారు.

సరిపడా పార్కింగ్, సీటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని, వారికి సరిపడా పార్కింగ్, సీటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను సిఎస్ ఆదేశించారు. డయాస్, నిరంతర విద్యుత్, ఫ్లోరల్ డెకరేషన్, మంచినీటి సౌకర్యాలతో పాటు వేదిక మొత్తం పండగ వాతావరణం వచ్చేలా అలంకరించాలని ఆమె సూచించారు. కళాకారుల ర్యాలీ జరిగే ఐమ్యాక్స్ సర్కిల్ నుంచి అమరుల స్మారక కేంద్రం వరకు రహదారిని అందంగా అలంకరించాలని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల మాదిరిగానే, దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం కూడా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సిఎస్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News