Monday, January 20, 2025

కొత్త సిఎస్ శాంతికుమారి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఎఎస్ అధికారి శాంతికుమారి నియమితులయ్యారు. ఈ మేర కు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు సచివాలయంలో (బిఆర్‌కెఆర్ భవన్) ఆమె చీఫ్ సెక్రటరీగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం ఆమె రా ష్ట్ర అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1989వ బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి 2025 ఏప్రిల్ నెలలో రిటైర్ అవుతారు. అప్పటి వరకూ ఆమె చీఫ్ సెక్రటరీగా కొనసాగే అవకాశాలున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి మొదటి తెలుగు, మహిళా చీఫ్ సెక్రటరీగా శాంతికుమారి రికార్డుల్లో నిలిచిపోతా రు. వివాద రహితురాలిగా పేరున్న శాంతికుమారి సమస్యలను పరిష్కరించడంలో ప్రజల కోణం నుంచే ఆలోచన చేస్తారనే పేరుంది. సేవా దృక్ఫధంతోనే విధులు నిర్వర్తిస్తుంటారనే బ్యూరోక్రాట్లలో పేరుంది.

గతంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సి.ఎం.ఓ) ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఆమె సమర్ధతను మెచ్చుకొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆ తర్వాత వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదోన్నతిని పొందారు. బుధవారం మధ్యాహ్నం శాంతికుమారిని, ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న రామకృష్ణారావులను ప్రగతి భవన్‌కు పిలిపించుకొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇరువురు అధికారులతో చర్చలు జరిపారు. చీఫ్ సెక్రటరీ పదవికి అర్హులుగా ఉన్న అధికారుల్లో అందుబాటులో ఉన్న వారి ప్రొఫైల్, వ్యక్తిత్వం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్. అన్ని కోణాల నుంచి సమీక్షించుకొన్న తర్వాతనే సి.ఎస్.పదవికి శాంతికుమారిని ఎంపిక చేసినట్లుగా అధికారవర్గాలు తెలిపాయి. తనను చీఫ్ సెక్రటరీగా నియమించినందుకు శాంతికుమారి వెంటనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ప్రగతి భవన్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ కేడర్ ఐ.ఎ.ఎస్. అధికారుల్లో శాంతికుమారి కంటే సీనియర్లు ఉన్నప్పటికీ వారందరూ కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో వారిని పరిగణనలోకి తీసుకోలేదు. వసుధామిశ్రా, శశాంక్ గోయల్, అశోక్‌కుమార్‌లు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. మరో సీనియర్ అధికారి రాణికుముదిని ఈ ఏడాది జూన్‌లోనే రిటైర్ అవుతున్నారని, ఆ తర్వాత శాంతికుమారి సీనియర్‌గా ఉన్నారని తెలిపారు. అందుకే శాంతికుమారికి సి.ఎస్.పదవి దక్కిందని ఆ అధికారులు వివరించారు.
రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా : శాంతికుమారి
తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నూతన చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అన్నారు. చీఫ్ సెక్రటరీగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాంతికుమారి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తనమీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్.గారి ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలతోపాటుగా అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా, విజయవంతంగా అమలు చేయడానికి సహచర అధికారులతో సమన్వయంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతంగా అమలుచేయడానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని, వాటిని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. తన బాధ్యతలను, కర్తవ్యాన్ని నిబద్దతతో నిర్వర్తిస్తానని నూతన సి.ఎస్.శాంతికుమారి మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.
సచివాలయంలో కోలాహలం…
తెలంగాణ సచివాలయంలో బుధవారం అత్యంత కోలాహలంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా బుధవారం అధికారుల హడావిడితో సందడి వాతావరణం నెలకొంది. నూతన చీఫ్ సెక్రటరీగా శాంతి కుమారి స్వీకరించే కార్యక్రమానికి ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్.అధికారులు భారీగా హాజరయ్యారు. చీఫ్ సెక్రటరీ అవుతారని భావించిన ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు అందరికంటే ముందుగా నూతన సి.ఎస్. శాంతికుమారికి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఆ తర్వాత డి.జి.పి.గా ఇటీవలనే నియమితులైన అంజనీకుమార్ కూడా సచివాలయానికి వచ్చి నూతన సి.ఎస్.ను కలిసి అభినందించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి కూడా నూతన సి.ఎస్.ను కలిసి అభినందించారు. ఇక సచివాలయంలోని మిగతా ఐ.ఎ.ఎస్, అధికారులే కాకుండా అటవీ శాఖకు చెందిన ఐ.ఎఫ్.ఎస్.అధికారులు, పోలీస్ శాఖకు చెందిన పలువురు సీనియర్ ఐ.పి.ఎస్.అధికారులు సచివాయలానికి వచ్చి సి.ఎస్.శాంతి కుమారిని కలిసి అభినందించారు.
పేదరిక నిర్మూలనలోనే సేవలు…
తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా నియమితులైన శాంతికుమారి తన 33 ఏళ్ళ ఐ.ఎ.ఎస్.సర్వీసులో పేదరిక నిర్మూలన పథకాల అమలులోనే ఎక్కువ కాలం పనిచేసిన అనుభవముంది. ఎమ్మెస్సీ మెమెరైన్ బయాలజీ చదివిన శాంతికుమారి అమెరికాలో ఎం.బి.ఎ. చదివారు. ఐ.ఎ.ఎస్.అధికారిగా పేదరిక నిర్మూలనతోపాటుగా సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య. ఆరోగ్య రంగాలు, స్కిల్ డవలప్‌మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకాల్లో రెండేళ్ళపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్ళపాటు సీ.ఎం. కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టి.ఎస్.ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బి.సి.సంక్షేమ శాఖ కమిషనర్‌గా శాంతికుమారి సమర్ధవంతంగా బాధ్యతలను నిర్వర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News