ఆర్జేడీలో శరద్ ఎల్‌జెడి విలీనం
పాట్నా : లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వపు రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)లో శరద్ యాదవ్‌కు చెందిన ఎల్‌జెడి విలీనం అయింది. పాతిక సంవత్సరాల తరువాత ఈ పార్టీల విలీనం చోటుచేసుకుంది. తమ పార్టీని ఆర్జేడీలో విలీనం చేస్తున్న విషయాన్ని ఆదివారం శరద్ యాదవ్ విలేకరులకు తెలిపారు. ఇప్పుడు బీహార్‌కు తేజస్వీ యాదవ్ ఆశాజ్యోతి. బిజెపి వ్యతిరేక శక్తులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇటువంటి యువతరం నేతల నాయకత్వం అత్యవసరం అని, ఆర్జేడీని అంతా బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ దిశలోనే తమ పార్టీని ఆర్జేడీలో విలీనం చేస్తున్నామని చెప్పారు. పాతికేళ్ల క్రితం లాలూతో విభేధాలు ఏర్పడి శరద్ యాదవ్ సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. దీనితో బీహార్‌లోని దళిత, ముస్లిం, బిసి యాదవ్‌ల ఓట్లలో చీలిక ఏర్పడింది. అప్పటి నుంచి బిజెపి మిత్రపక్షాలే బీహార్‌లో రాజకీయంగా పైచేయిగా ఉంటున్నాయి.