Monday, December 23, 2024

ఎంవిఎ కూటమి సీఎం అభ్యర్థిపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ముంబై : అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవిఎ) కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించాలని వస్తున్న సూచనను ఎన్సీపీ (శరద్‌పవార్ ) చీఫ్ శరద్ పవార్ తిరస్కరించారు. కూటమి తరఫున శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీలో చర్చలు జరుగుతున్న సమయంలో శరద్‌పవార్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

‘మనకూటమే మన ఉమ్మడి సీఎం అభ్యర్థి. ఒక వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించటంపై మాకు నమ్మకం లేదు. ఉమ్మడి నాయకత్వమే మా ఫార్ములా అని శరద్ పవార్ అన్నారు. అయితే సిఎం అభ్యర్థి ప్రకటనపై కూటమిలో గురువారం నుంచి అంతర్గతం వివాదం చెలరేగినట్టు తెలుస్తోంది. ఓవైపు శరద్ పవార్ తిరస్కరిస్తున్న సమయం లోనే శివసేన (యూబీటీ ) ఎంపీ సంజయ్ రౌత్, ఎంవీకే కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ థాక్రేను నిలపాలని అంటున్నారు.

శరద్ పవార్ వ్యాఖ్యపై సంజయ్ రౌత్ స్పందించారు. ‘శరద్ పవార్ చెబుతుంది నిజమే. ఎంవీకే కూటమి ముందు మెజార్టీ స్థానాలను సాధించాలి. అయితే రాహుల్ గాంధీని లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఉంటే మరో 23 నుంచి 30 సీట్లను ఇండియా కూటమి గెలుచుకుని ఉండేది. ఇది మా పార్టీ అభిప్రాయం. ఏ ప్రభుత్వం , పార్టీ అయినా సీఎం అభ్యర్థి ముఖం లేకుండా ఉండకూడదు. ప్రజలకు కూడా వారు ఎవరికి ఓటు వేస్తున్నారో తెలియాలి కదా!. ప్రజలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నరేంద్రమోడీ ఇలా అభ్యర్థుల ముఖాలను చూసే ఓటు వేశారు. అదే విధంగా ఎంవీఏ కూటమి తరఫున ఎవరిని సీఎం అభ్యర్థిగా పెట్టినా మాకు ఇబ్బంది లేదు. ఎంవీఏ లో మూడు పార్టీలు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాయి. మళ్లీ అసెంబ్లీకి సైతం ఇలాగే ఉమ్మడిగా పోటీ చేయడానికి సిద్ధం ’ అని అన్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల సంజయ్ రౌత్ మాట్లాడుతూ , ఉద్ధవ్ థాక్రే గతంలో ఎంవీయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన చేసిన మంచి పనులను ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకున్నారు. అదే విధంగా లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉద్ధవ్ థాక్రే పలు మిత్ర పక్షాలను ముందుండి నడిపించారు.’ అని అన్నారు. మహారాష్ట్రలో రానున్న సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News