ఔరంగాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రైతుబంధు పథకం అమలు చేస్తున్నారు కదా, మహారాష్ట్రలో కూడాఈ తరహాలో రైతులకు సాయం అందించే విషయం ఆలోచించాలి కదా అని విలేకరులు పవార్‌ను ప్రశ్నించారు. దీనిపై పవార్ స్పందిస్తూ తెలంగాణ పథకం గురించి తాను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉందన్నారు. తెలంగాణ చిన్న రాష్ట్రం, అక్కడ ఇటువంటి పథకాలు ప్రకటించి, అమలు చేయడం సాధ్యమే అవుతుందని తెలిపిన పవార్ రైతులకు సంబంధించిన ఇటువంటి పథకాలకు, వ్యవసాయ మౌలిక సాధనాసంపత్తికి మరిన్ని నిధులు వెచ్చించాలని అభిప్రాయపడ్డారు.
బిజెపికి ఇక ఎదురుగాలే: పవార్
దేశంలో బిజెపి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఎన్‌సిపి నేత శరద్ పవార్ తెలిపారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పరాజయం బిజెపి పట్ల ప్రజలలో అసంతృప్తికి సంకేతం అవుతోందని వ్యాఖ్యానించారు. పలు కారణాలతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇది క్రమేపీ రాబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో స్పష్టం అవుతుందన్నారు. ఔరంగాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్రలో చిన్న చిన్న విషయాలకు మతం రంగుపులమడం సరైన పద్ధతి కాదన్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. అంతకు ముందు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఉంటుంది. బిజెపి పట్ల నెలకొంటున్న అసంతృప్తి కాలక్రమంలో ప్రజ్వరిల్లుతుందని తెలిపిన పవార్ అధికారంలో ఉన్న వారు శాంతిభద్రతలను కాపాడాల్సి ఉంటుంది. అయితే ఏదైనా విషయం గురించి అధికారంలో ఉన్న పార్టీలు రోడ్లపైకి రావడం సమాజంలోని రెండు వర్గాల మధ్య మరింత వైరానికి దూరానికి దారితీస్తుందని, ఇది ప్రమాదకరం అన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ వాట్సాప్ రేపిన చిచ్చు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలకు దిగారు.