Sunday, November 17, 2024

శరద్ పవార్ సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

శరద్ పవార్ సంచలన నిర్ణయం
ఎన్‌సిపి అధ్యక్ష పదవికి రాజీనామా
కొత్త అధ్యక్షుడి ఎంపికకోసం పార్టీ నేతలతో కమిటీ
తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీ కార్యకర్తలు
కన్నీళ్లు పెట్టుకున్న నేతలు

ముంబయి: ఎన్‌సిపి అధ్యక్షుడు, రాజకీయ కురువృద్ధుడు అజిత్ పవార్ కీలక ప్రకటన చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ముంబయిలో జరిగిన తన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పవార్ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని పార్టీ కార్యక్త్రలు తీవ్రంగా వ్యతిరేకించారు. మరికొంతమంది అయితే కన్నీళ్లు పెట్టుకున్నారు. తన నిర్ణయాన్ని మార్చుకోవలసిందిగా కోరుతూ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్‌సిపి మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌పటేల్, పార్టీ నాయకుడు జితేంద్ర అవధ్‌లు పవార్ తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత కన్నీళ్లు పెట్టుకోగా పార్టీ ఎంపి ప్రఫుల్ పటేల్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవలసిందిగా పవార్‌ను నచ్చ చెప్పడానికి ప్రయత్నించడం కనిపించింది. రాజీనామాను ప్రకటించడంపై పవార్ ఎవరికీ చెప్పలేదని పటేల్ చెప్పారు.

తన సమీప బంధువు అజిత్ పవార్ ఎన్‌సిపిని వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ఊహాగానాల మధ్య శరద్ పవార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే పార్టీ కొత్త ధ్యక్షుడిని సీనియర్ నేతలతో కూడిన కమిటీ నిర్ణయిస్తుందని పవార్ చెప్పారు. ఈ కమిటీలో ప్రఫుల్ పటేల్, సునీల్ ్తత్కరే, కెకె శర్మ, పిసి చాకో, అజిత్ పవార్, జయంత్ పటేల్, సుప్రియా సూలె, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే, అనిల్ దేశ్‌ముఖ్, రాజేశ్ తోపే, జితేంద్ర అవధ్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, జయదేశ్ గౌక్వాడ్‌లు ఉంటారని పవార్ చెప్పారు.

Also Read: పాస్‌పోర్టులో తండ్రి పేరును తొలగించండి…

మరికొందరు ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఈ కమిటీలో ఉంటారన్నారు. 1960 మే 1న ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణం 63 సంవత్సరాల పాటు నిరాఘాటంగా సాగిందని. వివిధ హోదాల్లో మహారాష్ట్రకు, దేశానికి సేవలందించానని పవార్ ఈ సందర్భంగా చెప్పారు. పార్లమెంటులో మరో మూడేళ్లు తన రాజ్యసభ సభ్యత్వం ఉందని, ఈ సమయంలో తాను మహారాష్ట్రకు, దేశానికి సంబంధించిన సమస్యలపై దృష్టిపెడతానని, అయితే ఏ బాధ్యతనూ తీసుకోబోనని ఆయన చెప్పారు. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న తర్వాత ఎక్కడో ఒక చోట వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉందని, అందుకే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవినుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నానని పవార్ చెప్పారు. కాగా తన రాజీనామాను వ్యతిరేకిస్తూ ఉద్వేగానికి గురయిన పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ తాను ఎప్పటికీ మీతోనే ఉంటానని, అయితే ఎన్‌సిపి అధ్యక్షుడిగా మాత్రం ఉండనని చెప్పారు.అయితే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీ కార్యకర్తలు పవార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే దాకా పార్టీ కార్యాలయంనుంచి కదిలేదంటూ అక్కడే బైఠాయించారు.

మహారాష్ట్రలో మునుపటి సంకీర్ణ ప్రభుత్వంలో భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలను ఒక్క చోటికి చేర్చిన ఘనత శరద్ పవార్‌కే దక్కుతుంది. ఆయన చొరవవల్లే కాంగ్రెస్, ఎన్‌సిపి, శివసేన కలిపి అధికారాన్ని పంచుకున్నాయి. అయితే శివసేనలో చీలిక రావడంతో ఆ కూటమి ప్రభుత్వం పడిపోయింది. అయినప్పటికీ ఆ పార్టీలు ఇప్పటికీ ఒక్కటిగానే ఉన్నాయి. అయితే ఇటీవల అజిత్ పవార్ భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతున్నారనే వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి.తనకు మద్దతుగా ఉన్న ఎంఎల్‌ఎలతో కలిసి ఆయన కమలం తీర్థం తీసుకుంటారన్నది ఆ వార్తల సారాంశం. అయితే ఈ వార్తలను అజిత్, శరద్ పవార్‌లు ఇద్దరూ తోసిపుచ్చారు.అయితే శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలే మాత్రం వచ్చే 15 రోజుల్లో దేశ రాజకీయాల్లో రెండు భారీ కుదుపులు సంభవిస్తాయని, అందులోఒకటి దేశ రాజధాని ఢిల్లీలో, మరోటి మహారాష్ట్రలో వస్తాయని అన్నారు. శరద్ పవార్ ప్రకటన గురించి ముందే తెలిసే సుప్రియ ఆ మాటలు అని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మహారాష్ట్ర దాదా
శరద్ పవార్ 1940లో మహారాష్ట్రలోని బారామతిలో జన్మించారు. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో ఆసక్తి చూపారు. కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన ఆ పార్టీ తరఫున నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అయితే పూర్తి కాలం ఎప్పుడూ పదవిలో లేరు. పలు పర్యాయాలు పార్లమెంటు ఉభయసభలకు ప్రాతినిధ్యం వహించారు.తదనంతర కాలంలో సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టడంపై వచ్చిన విభేదాల కారణంగా 1999లో పార్టీని వీడి పిఎ సంగ్మా, తారిఖ్ అన్వర్‌లతో కలిసి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) స్థాపించారు.

మాజీ ప్రధానులు పివి నరపింహారావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పని చేశారు. రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ,వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖల బాధ్యతలు చూశారు. 2005నుంచి 2008 వరకు బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2010నుంచి 2012 వరకు ఐసిసిప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పవార్ ఎగువ సభలో ఎన్‌సిపి పక్ష నేతగా కొనసాగుతున్నారు. రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలకుగాను కేంద్రప్రభుత్వం 2017లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News