Saturday, November 23, 2024

ఎన్‌సిపిలో చీలికే లేదు

- Advertisement -
- Advertisement -

పుణె: ఎన్‌సిపిలో చీలిక వ్యవహారం ఇటీవల మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన విషయం తెలిసిందే.తన బాబాయి, ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్‌పై అసమ్మతి వ్యక్తం చేసిన అజిత్ పవార్ తన వర్గ నేతలతో కలిసి బిజెపి ప్రభుత్వంలో చేరడం, ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సిపిలో చీలిక వార్తలను తోసిపుచ్చారు. అంతేకాదు, అజిత్ పవార్ ఇప్పటికీ తమ పార్టీ నేతేనని అన్నారు. కొల్హాపూర్‌లో ఓ ర్యాలీలో మాట్లాడడానికి వెళ్లేముందు తన స్వస్థలమైన బారామతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మెజారిటీ సభ్యులేమీ బైటికి వెళ్లిపోలేదుగా. కొందరు వ్యక్తులు భిన్నమైన వైఖరి తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో అందుకు వీలుంది.ఇదేం చీలిక కాదు’ అని అన్నారు. ఎన్‌సిపిలో చీలిక లేదని, అజిత్ పవార్ ఇప్పటికీ తమ నేతేనని తన కుమార్తె, ఎన్‌సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యల గురించి అడగ్గా ‘ అవును.. అందులో వివాదం ఏమీ లేదు’ అని పవార్ అన్నారు.

అయితే బారామతిలో తాను చేసినవ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీయడంతో ఆ వ్యాఖ్యలు చేసిన కొద్దిగంటల్లోనే తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేంటూ పవార్ వివరణ ఇచ్చుకున్నారు.‘ ఆయన మా నాయకుడని నేను చెప్పలేదు. అజిత్, సుప్రియ అన్నా చెల్లెళ్లు , అందువల్ల ఆమె అలా అనడంలో తప్పేమీ లేదు. దానిలో రాజకీయ అర్థాలు వెతకడం సరికాదు’ అని శరద్ పవార్ అన్నారు. మీరు సుప్రియా వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారా? అని అడగ్గా‘ నేనా? మీ అభిప్రాయం తప్పు. భిన్న మార్గాన్ని ఎంచుకున్న వాళ్లు మా నేతగా ఉండజాలరు’ అని ఆయన అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అజిత్ పవార్ ఉదయాన్నే హడాఆవుడిగా దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడాన్ని ఆయన గుర్తు చేస్తూ ‘ఎవరికైనా తప్పుదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు. మరో సారి ఇవ్వరు. ఎవరైనా మరోసారి అవకాశాన్ని అడగడమూ తప్పే’ అని పవార్ అన్నారు. ఇదిలా ఉండగా పార్టీ మొత్తం కలిసే ఉందని, బిజెపితో ఎలాంటి పొత్తూ ఉండదంటూ ఒక రోజు ముందు(గురువారం) సుప్రియా సూలే వ్యాఖ్యానించారు.‘

మా అధ్యక్షుడు శరద్ పవవార్. జయంత్ పాటిల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. దీనికి మేం కట్టుబడి ఉన్నాం. ఆయన( అజిత్ పవార్) భిన్నమైన వైఖరి తీసుకున్నారు. అది పార్టీ నిబంధనలకు విరుద్ధం.దీనిపై మేం అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. స్పీకర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం’ అని ఆమె అన్నారు.అజిత్ పవార్ బిజెపి ప్రభుత్వంలో చేరినప్పటికీ ఆయన తరచూ తన బాబాయ్ శరద్ పవార్‌తో భేటీ అవుతూనే ఉన్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. శరద్ పవార్ బిజెపితో జతకడతారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలను శరద్‌పవార్ ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News