కేంద్రంపై శరద్ పవార్ ఆరోపణ
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ హింసాకాండను బ్రిటిష్ పాలనలో జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణకాండతో తాను పోల్చినందుకే మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బంధువులు, అనుచరుల ఇళ్లపైన ఆదాయం పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయని ఎన్‌సిపి అధ్యక్షుడు, శరద్ పవార్ ఆరోపించారు. సోలాపూర్‌లో శుక్రవారం పార్టీ సమావేశం ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునే హక్కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. లఖింపూర్ ఖేరీ హింసాకాండను జలియన్‌వాలా బాగ్ మారణకాండతో తాను పోల్చిన కారణంగానే ఐటి దాడులు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యంలో తాము తమ అభిప్రాయాలు మాట్లాడే హక్కు లేదా అని పవార్ ప్రశ్నించారు.
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి(ఎంవిఎ-శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి) ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర నిధులలో కూడా రాష్ట్రానికి రావలసిన వాటాను కేంద్రం విడుదల చేయడం లేదని ఆయన విమర్శించారు. బిజెపిని తమ మార్గం నుంచి అడ్డు తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంవిఎ మిత్రపక్షాలు విడివిడిగా పోటీ చేసినప్పటికీ 70 శాతం స్థానాలను గెలుచుకున్నాయని, కలసి కట్టుగా పోటీచేసే మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపి రైతు వ్యతిరేకిగా అభివర్ణిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. లఖింపూర్ ఖేరీ ఘటనకు నిరసనగా అక్టోబర్ 11న నిర్వహించనున్న మహారాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.