అమిత్ షాపై శరద్ పవార్ వర్గం ఎదురుదాడి
ముంబై: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(శరద్‌చంద్ర పవార్) శుక్రవారం మండిపడింది. బిజెపితో నకిలీ ఎన్‌సిపి, నకిలీ శివసేన చేతులు కలిపాయని ఆ పార్టీ ఆరోపించింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఒక ఎన్నికల సభలో అమిత్ సా ప్రసంగిస్తూ మహా వికాస్ అఘాడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వీటిని ఖండిస్తూ ఎన్‌సిపి(శరద్‌చంద్ర పవార్) అధికార ప్రతినిధి మహేష్ తాపసే శుక్రవారం ఎదురుదాడి చేశారు.
తమను నకిలీ ఎన్‌సిపి అంటూ చెప్పడానికి అమిత్ షా ఎవరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంలో నకిలీ నాయకులను బిజెపి చేర్చుకుందని ఆయన విమర్శించారు. మహారాష్ట్రకు వచ్చి శరద్ పవార్‌ను తిట్టకపోతే మీడియా పట్టించుకోదని తెలిసే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. మహారాష్ట్రకే కాక యావద్దేశానికి శరద్ పవార్ చేసిన సేవలు ఏమిటో అమిత్ షాకు తెలియదని ఆయన అన్నారు.