న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీతో ఎన్‌సిపి చీఫ్ శరద్‌పవార్ బుధవారం భేటీ అయ్యారు. పార్లమెంటులో ఉభయులూ సుమారు 20 నుంచి 25 నిమిషాల పాటు సమావేశ మయ్యారు. దీంతో వీరి సమావేశం వెనుక కారణం ఏమై ఉండవచ్చనేది ప్రధానంగా మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. మహారాష్ట్ర లోని అధికార మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) నేతలపై ముఖ్యంగా ఎన్‌సీపీ, శివసేన నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) వరుస దాడులకు పాల్పడుతుండడంతో మోడీని పవార్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది సహజమైన ప్రక్రియేనని, మరీ పెద్దదిగా చేసి చూడనవసరం లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు.
అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు దేశ ప్రధాని, జాతీయ పార్టీ నేత సమావేశం కావడం సహజమేనని, ఆ అంశాలు ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చని, ఇద్దరూ పెద్ద నేతలేనని, అజిత్ పవార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ఎన్‌సిపీ నేతలపై ఈడీ చర్యలు వాస్తవమే అయినప్పటికీ బీజేపీ , ఎన్‌సిపీ మధ్య పొరపొచ్చాలు లేవని బీజేపీ నేత సుధీర్ ముంగటివార్ అన్నారు. పలువురు ఎంవీఏ నేతలపై ఈడీ విచారణ జరుపుతోందని, ఇద్దరు ఎన్‌సిపి నేతలు జైలులో ఉన్నారని, పలువును శివసేన నేతలపై కూడా విచారణ జరుగుతోందన్నారు. బహుశా ఈ కారణం గానే ప్రధానితో పవార్ సమావేశం అయి ఉండొచ్చని మరో బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ అభిప్రాయపడ్డారు.