న్యూఢిల్లీ: ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో సమావేశమే ప్రతిపక్షాల కూటమి ఇండియా తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఇండియా కూటమి సమావేశాలు గత ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబయిలో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం తర్వాత కూటమి ఇప్పటివరకు సమావేశం కాలేదు. ఈ ముగ్గురు నేతలు దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపైన, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని భావిస్తున్న ఇండియా కూటమి తదుపరి కార్యాచరణపైన ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కూటమి తదుపరి సమావేశానికి సంబంధించి ప్రణాళికలను కూడా వారు ఖరారు చేసినట్లు తెలుస్తోంది, పవార్‌తో తన సమావేశానికి సంబంధించిన ఫొటోలను ఖర్గే తర్వాత ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టుచేశారు. ‘ఈ దేశ ప్రజల వాణిని మరింత బలంగా వినిపించడం కోసం రాహుల్ గాంధీతో కలిసి నేను ఈ రోజు ఎన్‌సిపి అధ్యక్షుడు పవార్‌జీతో భేటీ అయ్యాను.
ప్రతి సవాలుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఇండియా కూటమి ట్యాగ్‌లైన్ అయిన ‘ జుడేగా భారత్, జీతేగా ‘ఇండియా’ను కూడా ఆయన తన ట్వీట్‌కు జతచేశారు. ఖర్గేనివాసంలో జరిగిన సమావేశానికి సంబంధించిన ఫొటోలను పవార్ కూడా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఎన్‌సిపి ఎంఎల్‌ఎ జితేంద్ర అవధ్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గురుదీప్ సప్పల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. భోపాల్‌లో ఈ నెలలో జరగాల్సిన ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఉమ్మడి బహిరంగ సభ రద్ద్దయిన నేపథ్యంలో పవార్, ఖర్గే, రాహుల్‌ల సమావేశం జరిగింది. ‘సనాతన ధర్మ’కు వ్యతిరేకంగా డిఎంకె నేతలు చేసిన ప్రకటనలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ సభ రద్దయింది. కాగా ఇండియా కూటమి తదుపరి సమావేశం పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించాలని ప్రతిపక్ష నేతలు కొంతమంది సూచిస్తున్నారు.