సహకార మంత్రిత్వశాఖపై ఆందోళన
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ శనివారం నాడిక్కడ ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో అమిత్ షా సారథ్యంలో కొత్తగా ఏర్పడిన కేంద్ర సహకార మంత్రిత్వశాఖపై శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు రైతుల సమస్యలను ప్రస్తావించినట్లు ఎన్‌సిపి వర్గాలు తెలిపాయి.
రాజ్యసభ ఎంపి శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు అంటూ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేయడంతోపాటు వారిద్దరూ సమావేశమైన చిత్రాన్ని జత చేసింది. కాగా..ప్రధాని మోడీని కలుసుకోవడంతోపాటు సహకార మంత్రిత్వశాఖపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయనకు పవార్ ఒక లేఖ కూడా రాశారు. సహకార బ్యాంకింగ్ రంగం రాష్ట్ర జాబితాలోకి వస్తుందని పవార్ పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పులను తన లేఖలో ఉదహరించారు. ఇందులో ఎటువంటి జోక్యం చేసుకున్నా అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయన పేర్కొన్నారు.