Wednesday, January 22, 2025

పవార్ పాచిక?

- Advertisement -
- Advertisement -

మరాఠా మల్లుడు శరద్ పవార్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. మంగళవారం నాడు ముంబైలో స్వీయ చరిత్ర గ్రంథం తదుపరి భాగం ఆవిష్కరణ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. పార్టీ నాయకత్వంలో మార్పు అవసరం గురించి కొద్ది రోజుల క్రితం పవార్ సాహెబ్ స్వయంగా చెప్పారని, ఆయన వయసును, ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకొని ఈ నిర్ణయాన్ని మనం అర్థం చేసుకోవాలని అజిత్ పవార్ ఆ వెంటనే అన్నారు. అప్పుడు ఆయన శరద్ పక్కనే వున్నారు. అయితే 82 ఏళ్ళ శరద్ పవార్ క్రియాశీల రాజకీయాల నుంచి మాత్రం తాను తప్పుకోలేదని కూడా ప్రకటించడం గమనార్హం. నేనింత కాలం మీతో కలిసి వున్నాను. ఇప్పుడూ, ఇక ముందు కూడా అలాగే వుంటాను అని ఆయన కన్నీళ్ళపర్యంతమైన తన అనుచర గణంతో అన్నారు.

1960 మే 1 నుంచి 2023 మే 1 వరకు సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన తర్వాత నిష్క్రమించడం అవసరం అంటూనే క్రియాశీల రాజకీయాలలో కొనసాగుతానని ప్రకటించడంలో శరద్ పవార్ ఉద్దేశం ఏమిటి? ఇటీవల సంభవించిన కొన్ని పరిణామాల తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఆసక్తిదాయకంగా వుండడం సహజం. పార్టీకి కొత్త తరం నాయకత్వం అవసరం వున్నదంటూ నూతన సారథి ఎంపిక కోసం సీనియర్ నేతలతో ఒక కమిటీని శరద్ పవార్ ప్రకటించారు. అందులో అజిత్ పవార్ కూడా వున్నారు. 15 రోజుల్లో రెండు పెద్ద రాజకీయ పేలుళ్ళు సంభవించనున్నాయని అందులో ఒకటి ఢిల్లీలో, మరోటి మహారాష్ట్రలో చోటు చేసుకుంటాయని శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పక్షం రోజుల క్రితం అన్నారు. ఒకటిప్పుడు జరిగిపోయింది. రెండో దాని కోసం వేచి చూడాలి.

శరద్ పవార్‌కు మహారాష్ట్ర రాజకీయాలు కొట్టిన పిండి, నల్లేరు మీద నడక. నాలుగు సార్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రక్షణ మంత్రిగా, కేంద్ర వ్యవసాయ మంత్రిగా పని చేసిన విశేష రాజకీయానుభవం వుంది. అన్ని విధాలా సారథ్య పటిమ గడించిన వారే. సోనియా గాంధీని ఢీ కొని కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి 1999లో ఎన్‌సిపిని నెలకొల్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై పేచీ ఏర్పడి బిజెపితో శివసేన తెగతెంపులు చేసుకున్నది. ఆ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బిజెపి అవతరించినా శివసేన దూరం కావడంతో దానికి అధికారం దక్కలేదు. ఆ పరిస్థితులలో పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు కలిగిన శివసేనను, కాంగ్రెస్‌ను ముడివేసి ఎన్‌సిపిని కూడా జత చేర్చి మహా అగాధీ వికాస్ అనే ఐక్య సంఘటన ప్రభుత్వాన్ని కూర్చిన ఘనత శరద్ పవార్‌ది. ఆ యత్నాలు ఒక వైపు సాగుతుండగా, కేంద్రంలోని బిజెపి పాలకులు చక్రం తిప్పి అజిత్ పవార్‌ను దువ్వి ఎన్‌సిపి నుంచి బయటికి లాగారు.

దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఒకానొక రోజు తెల్లవారు జామున రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. వెంటనే శరద్ పవార్ రంగ ప్రవేశం చేసి అజిత్ పవార్‌ను ఆ కూటమి నుంచి బయటికి లాగారు. దానితో కొద్ది గంటల వ్యవధిలోనే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ ప్రభుత్వం పురిట్లోనే సంధి కొట్టింది. ఆ విధంగా ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా మహా వికాస్ అగాధీ ప్రభుత్వం 31 మాసాల దీర్ఘ కాలం పాటు కొనసాగింది. శివసేనలో చీలిక తేవడం ద్వారా ఆ ప్రభుత్వాన్ని 2022 జూన్‌లో బిజెపి పాలకులు కూల్చివేశారు. ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా అప్పుడు ఏర్పాటైన ప్రభుత్వం కొనసాగుతుందా లేదా అనే సందిగ్ధ పరిస్థితి నెలకొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన చీలిక గ్రూపు రాజ్యాంగ అర్హతను సుప్రీంకోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. శివసేన నుంచి ఒక వర్గం వచ్చి అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై తాము తిరుగుబాటు చేస్తున్నట్టు చెప్పగానే, ముఖ్యమంత్రికి గవర్నర్ విశ్వాస పరీక్ష ఉత్తర్వులు జారీ చేయడమేనా అలా చేయడం ద్వారా ఉద్ధవ్ ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితిని గవర్నరే ప్రేరేపించడం తగునా అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.

ఈ కేసు విచారణ పూర్తి చేసి తీర్పును వాయిదా వేసింది. తీర్పు షిండే వర్గానికి వ్యతిరేకంగా వస్తే ఆయన ప్రభుత్వం కుప్పకూలిపోవలసి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో బిజెపి అధికారాన్ని జారవిడుచుకోదు. అందుకు వీలుగా అజిత్ పవార్‌ను అది మళ్ళీ దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నదని ఈసారి అతడు ఎన్‌సిపిలో చీలిక తెచ్చి బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నాడని కొంత కాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. అప్పుడు అజిత్ తన మాట విని బిజెపి కూటమి నుంచి బయటికి వచ్చినందుకు ఇప్పుడు శరద్ పవారే స్వయంగా ఆయన్ను కమలనాథుల చేతిలో పెట్టడానికి సిద్ధమయ్యారని అందుకు ముందుగా పార్టీ అధ్యక్ష స్థానంలో అతడిని కూచోబెట్టి తాను తప్పుకోడమే సరైనదని శరద్ పవార్ భావించి వుండవచ్చు. మహారాష్ట్రలో మరో ఆసక్తికరమైన అధికార మార్పిడి ఘట్టానికి శరద్ పవార్ చర్య నాందీ అనుకోవచ్చునా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News