పుణె: మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో బాలికలపై ఓ స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన తెలిసిందే. ఇది మహారాష్ట్ర ప్రతిష్ఠకు తీరని కళంకమని ఎన్‌సిపి(ఎస్‌పి) చీఫ్ శరద్ పవార్ శనివారం ఆరోపించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతను విస్మరించిందని విమర్శించారు. ఈమేరకు మౌనంగా ఆయన నిరసన పాటించారు. బద్లాపూర్ సంఘటనతో విపక్షం రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వం భావిస్తే ప్రభుత్వం చైతన్యం లేనిదని అనుకోవలసి వస్తుందని వ్యాఖ్యానించారు.
విపక్షకూటమి మహావికాస్ అఘాడీ(ఎంవిఎ)లో, కాంగ్రెస్, ఉద్ధవ్ థాక్రే నేతృత్వం లోని శివసేన యుబిటిలో కూడా ఎన్‌సిపి భాగస్వామిగా ఉంటోంది. మహిళలపై నేరాలు చేసే వారి చేతులు నరికిన ఛత్రపతి శివాజీ జన్మించిన భూమిలో ఇలాంటి దుర్ఘటన జరగడం అత్యంత శోచనీయంగా పవార్ పేర్కొన్నారు. బద్లాపూర్ సంఘటనకు నిరసనగా శనివారం మహారాష్ట్ర బంద్‌కు మహావికాస్ అఘాడీ పిలుపునిచ్చింది. అయితే బంద్ పాటింపును బోంబై హైకోర్టు నివారించింది. దాంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు నోటికి నల్ల పట్టీలు కట్టుకుని నిరసనలు తెలుపుతున్నారు.