Monday, January 20, 2025

ఇలాంటివి చాలా చూశా..

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్రలో జరిగిన ఎన్‌సిపి పరిణామాలపై ఈ పార్టీ నేత శరద్ పవార్ ఆదివారం స్పందించారు. మేనల్లుడు , పార్టీ సీనియర్ నేత అయిన అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడం ఆయన వ్యక్తిగత నిర్ణయం అన్నారు. అయితే పార్టీలో ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించేది లేదని తెలిపారు. జరిగిన పరిణామాలతో కంగుతిన్నట్లు కన్పించిన పవార్ విలేకరుల సమావేశంలో పరోక్షంగా బిజెపి రాజకీయ వక్రబుద్ధిని ప్రస్తావిస్తూ తీవ్రంగా స్పందించారు. అజిత్ పవార్ తిరుగుబాటును తమ పార్టీ సమ్మతించడం లేదన్నారు. ఏది ఏమైనా పార్టీలో ఇంతవరకూ అజిత్ పవార్ కుంభకోణాలతో తలెత్తిన అవినీతి మరకల నుంచి ఇప్పుడు బిజెపినే తమను విముక్తం చేసినట్లు అయిందని వ్యాఖ్యానించారు.

మంత్రులుగా చేరిన కొందరు ఎన్‌సిపి వారిని అవినీతి ఆరోపణల నుంచి ప్రధాని మోడీ , అమిత్ షాలు ఇప్పుడు తప్పించినట్లు అయిందని, ఈ విధంగా ఒకందుకు తనకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటి పరిణామాలు షాకే అయితే దీనితో తనకు ఆందోళన ఏమీ లేదన్నారు. పలువురికి ఇప్పుడు జరిగిన విషయాలు ఆశ్చర్యం కల్గించి ఉంటాయని అయితే తనకు ఇటువంటివి కొత్త కాదన్నారు. 1980లో పార్టీ నాయకులు అనేకులు ఇదే విధంగా పార్టీని వీడినా తాము పార్టీని బలోపేతం చేసిన విషయం గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందన్నారు.

ఎన్‌సిపిపై హక్కు గురించి సమస్యే లేదు
ఇప్పుడు ఎన్‌సిపిపై తమకే హక్కు ఉందని అజిత్ పవార్ వర్గీయులు వాదిస్తారని పవార్ తెలిపారు. అయితే దీనితో సమస్య ఏదీ ఉండదన్నారు. తాము ప్రజల వద్దకు వెళ్లుతామని వారి మద్దతు తమకు ఉంటుందని ఆశిస్తున్నామని, ప్రజల నుంచి బలంతోనే పార్టీ ఎవరనే విషయం , హక్కుల సంగతి తెలుస్తుందన్నారు. ఇప్పటి పరిణామాలపై తనకు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే, మమత బెనర్జీ ఫోన్ చేసి మాట్లాడారని , మద్దతు ప్రకటించారని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తామని, తమది కీలక పాత్ర అవుతుందని చెప్పారు. ఇప్పటి పరిణామాలతో జాతీయ రాజకీయాలు, ప్రత్యేకించి ప్రతిపక్ష సమైక్యతా సాధన దిశలో తన (పవార్ )ప్రాధాన్యత తగ్గుతుందనే వాదనను ఆయన తోసిపుచ్చారు.

నేడు పార్టీ కీలక సమావేశం ః పవార్
ఎన్‌సిపిని తానే పెంచి పోషించానని, రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నానని అజిత్ పవార్ చెప్పడంపై పవార్ మండిపడ్డారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పవచ్చునని అయితే, నిజాలు త్వరలోనే తేలుతాయని వివరించారు. ఇప్పటి పరిణామాలపై చర్చించేందుకు పార్టీ నేతలు సోమవారం సమావేశం అవుతున్నారని చెప్పారు. తాను పార్టీలో ఇకపై కీలక పాత్రలో ఉండబోనని తెలిపిన పవార్ గత నెలలోనే పార్టీలో కీలక మార్పులు చేశారు. కూతురు, ఎంపి సుప్రియా సూలే, మరో నేత ప్రఫుల్ పటేల్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా చేశారు. అప్పటికే అజిత్ పవార్ అసంతృప్తితో ఉండటం, బిజెపి వైపు వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు తెలియడంతో ఆయనను కేవలం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వరకే పరిమితం చేశారు. ఈ పరిణామంతో అజిత్ పవార్ ఇప్పుడు సీనియర్ నేత పవార్‌పై తిరుగుబాటుకు దిగినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News