కులాన్ని దాచుకోను.. కుల రాజకీయాలు చేయను
క్యాస్ట్ సర్టిఫికెట్ వైరల్ కావడంపై శరద్ పవార్ స్పందన
ముంబై: ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి) వర్గానికి చెందిన వ్యక్తి అంటూ ఒక సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన స్పందించారు. కులాన్ని దాచుకోవాల్సిన అవసరం తనకు లేదని, కులాన్ని అడ్డం పెట్టుకుని తాను ఏనాడూ రాజకీయాలు చేయలేదని మంగళవారం ప్రకటించారు. తన కులం ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. తాను ఏనాడూ కులం ఆధారంగా రాజకీయాలు చేయలేదు.. చేయను కూడా అని పవార్ ప్రకటించారు. కానీ సమాజంలోని సమస్యలను పరిష్కారం తాను చేయాల్సింది చేస్తానని పవార్ వెల్లడించారు.
ఓబీసీ సామాజికవర్గం పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని, అయితే తాను పుట్టిన కులాన్ని దాచిపెట్టడం తనకు ఇష్టం ఉండదన్నారు. అయితే మరాఠా కమ్యూనిటీ కోటాపై మాట్లాడుతూ.. రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని దన్నారు. పవార్ కుమార్తె సుప్రియా సూలే అది నకిలీ సర్టిఫికెట్ అని కొట్టిపారేశారు. శరద్ పవార్ 10వ తరగతి చదువుతున్నప్పుడు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ఉండేవా ప్రజలు ఆలోచించాలని ఆమె కోరారు.