ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ మంగళవారం ప్రకటించారు. ఎన్‌సిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ ఎలిపారు. తన ఆత్మకథ లోక్ మఝే సంగాయి-రాజకీయ ఆత్మకథ..విడుదల సందర్భంగా శరద్ పవార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎప్పుడు ఆగాలో తనకు తెలుసునని, తదుపరి అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకునేందుకు ఎన్‌సిపి సీనియర్ నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేశానని 82 ఏళ్ల శరద్ పవార్ తన కుమార్తె ప్రతిభ సమక్షంలో ప్రకటించారు.
అయితే..గత 55 ఏళ్లుగా కొనసాగుతున్న తరహాలోనే సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూనే ఉంటానని ఆయన పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. కాగా..పవార్ రాజ్యసభ సభ్యత్వం కాలపరిమితి మరో మూడేళ్లు ఉంది. ఇదిలా ఉంటే..శరద్ పవార్ హఠాత్తుగా చేసిన ఈ ప్రకటన పార్టీ కార్యకర్తలు, నాయకులలో దిగ్భ్రాంతిని కలగచేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన అభిమానులు తమ అధినాయకుడి నిర్ణయం పట్ల కళ్లనీళ్లు పెట్టుకున్నారు. పవార్ రాజకీయాలలో కొనసాగాలని, దేశానికి ఆయన సేవలు ఇంకా అవసరమంటూ వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు.