ముంబై : నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వివాదం భారత ఎన్నికల కమిషన్ ముందు విచారణకు వస్తోంది. దీనిపై ఈనెల 6న తన వాదన ఈసీఐ ముందు వినిపించనున్నట్టు ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ఆదివారం తెలియజేశారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎవరనేది ప్రతి ఒక్కరికీ తెలుసని, తనకు సమన్లు వచ్చినందున ఈసీఐ ముందు విచారణకు హాజరవుతానని చెప్పారు. రాజకీయాల్లో కొందరు తమకు తోచిన నిర్ణయాలు తీసుకుంటారని, ప్రజాస్వామ్యంలో ఇది వారి హక్కు అని, దీనిపై తాను వ్యాఖ్యానించబోనని చెప్పారు. అయితే సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారన్నదే ప్రధానమని అన్నారు. మహారాష్ట్రతోపాటు దేశం లోని అందరికీ ఎన్‌సిపీ వ్యవస్థాపకుడు ఎవరనేది బాగా తెలుసని, పరిస్థితి తమకే అనుకూలంగా ఉంటుందని జనం అనుకుంటున్నట్టు తెలిపారు.
బీజేపీతో చేతులు కలిపిన వారు ఎంతమాత్రం ఎన్‌సిపికి చెందినవారు కాదని, ఈ విషయంలో తాము రాజీ పడేది లేదని పవార్ స్పష్టం చేశారు. విపక్ష కూటమి ఇండియా బ్లాక్ గురించి మాట్లాడుతూ తదుపరి కార్యాచరణ ఏమిటనేది కొద్ది రోజుల్లో ఖరారవుతుందని పవార్ చెప్పారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, 2024 ఎన్నికల్లో ఆ మార్పు కనిపిస్తుందని అన్నారు. ఈ ఏడాది జులై 2న అజిత్ పవార్ ఎనిమిది మంది ఎమ్‌ఎల్‌ఎలతో కలిసి మహారాష్ట్ర లోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరడంతో ఎన్‌సీపీలో చీలిక ఏర్పడింది. దీంతో ఇటు శరద్ పవార్ వర్గం, అటు అజిత్ వర్గం ఎవరికి వారే పార్టీ తమదేనని ప్రకటించుకున్నారు. పార్టీ పేరు, గుర్తు తమకే కేటాయించాలంటూ ఈసీఐని ఆశ్రయించారు.