అహ్మదాబాద్ : ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ , అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని కలిశారు. వీరిద్దరూ కలిసి అహ్మదాబాద్ సనంద్ లోని ఓ గ్రామంలో ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఆ తర్వాత అహ్మదాబాద్ లోని అదానీ నివాసాన్ని , కార్యాలయాన్ని పవార్ సందర్శించారు. ఈ విషయాన్ని శరద్ పవార్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే వీరిద్దరూ కలిసి ఫ్యాక్టరీని ప్రారంభించిన ఫోటోను కూడా పంచుకున్నారు. అయితే వీరిద్దరి భేటీలో ఏయే అంశాలపై చర్చించారన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో శరద్ పవార్‌ను ముంబై లోని ఆయన నివాసంలో గౌతమ్ అదానీ కలిసిన విషయం తెలిసిందే.
దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నట్టు సంబంధిత వర్గాలు అప్పట్లో వెల్లడించాయి. అయితే అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ రీసెర్చి నివేదికపై విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్న సమయంలోనే ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకే తాను మొగ్గు చూపుతున్నట్టు పవార్ ఆ సమయంలో ప్రకటించారు. ఆ తర్వాత జూన్‌లో అదానీ మరోసారి పవార్‌ను కలిశారు.