Thursday, December 26, 2024

పవార్లలో ఎవరిది పైచేయి?

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో పవార్ల యుద్ధం ఊహించిన మలుపులే తిరుగుతున్నది. శివసేన చీలిక ఉదంతాన్నే తలపిస్తున్నది అని రాజకీయ పరిశీలకులు తేల్చేశారు. కాని అందుకు భిన్నంగాను, వైవిధ్యం కూడినదిగాను పవార్ల వృత్తాంతం కొత్త మలుపులు, మెరుపులు చూపిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. శరద్,- అజిత్ పవార్ల వర్గాలు తమ తమ ఎంఎల్‌ఎలు, తదితర బలాలతో సమావేశమై పరస్పరం బహిష్కరణల అస్త్రాలు సంధించుకొన్నాయి. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర శాసన సభలో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఐక్య నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) బలం 53. మొన్న ఎన్‌సిపిని చీల్చి, షిండే శివసేన -బిజెపి ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ వర్గం సభకు 29 మంది ఎంఎల్‌ఎలు, నలుగురు ఎంఎల్‌సిలు హాజరయ్యారు. దీనిని బట్టి మెజారిటీ శాసన సభ్యులు అజిత్ పవార్ వర్గంతోనే ఉన్నారని ధ్రువపడుతున్నది. పార్టీ పేరు, గుర్తు తమకే చెందాలని రెండు వర్గాలు కోరుతున్నాయి. చీలిన శివసేన వర్గాల విషయంలో ఎన్నికల సంఘం పేరు, గుర్తు రెండూ ఏక్‌నాథ్ షిండే వర్గానికే కేటాయించింది.

అది కేంద్రంలోని అధికార పక్షానికి అనుకూల నిర్ణయం. ఇప్పుడు కూడా కమలనాథుల ప్రభుత్వంలో చేరి పదవులు సైతం పొందింది అజిత్ పవార్ వర్గమే కాబట్టి, ఎన్‌సిపి మెజారిటీ వర్గం కూడా అదే అయినందున ఇసి దాని వైపే మొగ్గవచ్చు. ఎన్‌సిపిలో ఇప్పుడు తలెత్తిన ఈ సంక్షోభం వెనుక వున్నది శరద్ పవారే అయితే ఆ ముగింపు వేరేగా ఉంటుంది. అలా కాకుండా ఇది నిజమైన చీలికే అయినప్పుడు ఎవరిది అసలైన పార్టీ, గుర్తు అనేవి ఇసి, స్పీకర్ వద్ద, కోర్టుల్లో తేలాలి. శివసేన విషయంలో ఏక్‌నాథ్ షిండే తాము తిరుగుబాటు చేస్తున్నామని చెప్పగానే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని అప్పటి మహా వికాస్ అఘాదీ (ఎంవిఎ) ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేని కోరినందుకు గవర్నర్‌ను సుప్రీంకోర్టు మందలించింది. అలా చేయడం ద్వారా ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితిని గవర్నర్ సృష్టించారని అభిప్రాయపడింది. ఆ విధంగా పార్టీ వ్యవస్థకు ప్రాధాన్యమిచ్చింది. పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని గౌరవించవలసిన అవసరాన్ని సూచించింది. అంటే ఒక పద్ధతి ప్రకారం పార్టీలో చీలిక ఏర్పడినప్పుడే గవర్నర్ రంగంలోకి దిగాలన్న సూత్రాన్ని నిర్ధారించింది.

శరద్ పవార్‌ను కాదని ఆయన పరోక్షంలో కొత్త ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా అజిత్ పవార్, ఆయన వర్గం ప్రమాణ స్వీకారం చేసిన విషయంలో గవర్నర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయం తన వరకు వస్తే సుప్రీంకోర్టు ఏమి చెబుతుందో అనేది ఆసక్తిదాయకమైన అంశం. శాసన సభలో ఒకరి ఎంఎల్‌ఎలను ఒకరు బహిష్కరిస్తూ సీనియర్, జూనియర్ పవార్‌లు ఇద్దరూ స్పీకర్‌కు నోటీసులు ఇచ్చారు. ముందుగా శరద్ పవార్ పార్టీ ఈ నోటీసు ఇచ్చింది. వాస్తవానికి అజిత్ పవార్ ప్రభుత్వంలో చేరడానికి రెండు రోజుల ముందు తనను తాను పార్టీ అధ్యక్ష పదవిలో ప్రతిష్టించుకొన్నారు. ఆ తీర్మానం మీద తన వైపు వున్న మెజారిటీ ఎంఎల్‌ఎలు, తదితరుల సంతకాలు చేయించుకొని స్పీకర్‌కు అందజేశారు. సుప్రీంకోర్టులో ఎటువంటి కష్టం ఎదురు కాకుండా న్యాయ నిపుణుల సలహా మేరకు అజిత్ పవార్ ఇలా చేసినట్టు భావించాలి. పోయిన వాళ్ళు పోయారు, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకొంటాం అని శరద్ పవార్ విలేకరులతో అన్నారు.

దానిని బట్టి ఆయన ఈ యుద్ధంలో అస్త్ర సన్యాసం చేయబోతున్నారని అనుకోవాలా? ఉభయ వర్గాలు అవతలి ఎంఎల్‌ఎల సభ్యత్వాలను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులపై స్పీకర్ ఎప్పుడు, ఎటువంటి నిర్ణయాలు తీసుకొంటారు? అజిత్ పవార్ తనను పార్టీ అధ్యక్షుడుగా ప్రకటించుకొన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా? పార్టీలో చీలిక అజిత్ పవార్ వర్గం ప్రభుత్వంలో చేరిన తర్వాతనే బహిర్గతమైంది. అటువంటప్పుడు దానిని చట్టబద్ధమైనదిగా సుప్రీంకోర్టు గుర్తిస్తుందా? అన్ని కోర్టులకు మించిన కోర్టు ప్రజా కోర్టు. మహారాష్ట్రలో అధికారాన్ని ఎట్టి పరిస్థితిలోనూ కోల్పోరాదని, రాబోయే ఎన్నికల్లోనూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో, అక్కడి లోక్‌సభ స్థానాల్లో తనదే పైచేయి చేసుకోవాలని బిజెపి ఆశిస్తున్నది. అందుకోసం ఎందుకైనా సిద్ధపడుతున్నది. దొడ్డిదారులు తొక్కుతున్నది, నిన్న శివసేనలో, తాజాగా ఎన్‌సిపిలో చీలిక తెచ్చి వాటిని బలహీనపరిచానని, తనకు ఎదురులేదని ఆనందపడుతున్నది.

దీనిపై ప్రజా న్యాయ స్థానం ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి. మహారాష్ట్రలో బిజెపి తరచుగా జరిపిస్తున్న ఈ కుట్ర రాజకీయాలు బెడిసికొట్టవచ్చు. అవి అన్ని వేళలా దానికి మంచి చేయవు, ఏడాది క్రితం ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని, ఇప్పుడు అజిత్ పవార్ వర్గాన్ని లోబరుచుకొని జరిపించిన ఘట్టాల్లో పదవులు లభించని ఎంఎల్‌ఎల వల్ల భవిష్యత్తులో అసమ్మతి తలెత్తే అవకాశాలు ఎదురైతే ఏమవుతుందో ఊహించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News