Thursday, January 23, 2025

మహారాష్ట్రలో బాబాయ్ అబ్బాయ్ పవర్ వార్

- Advertisement -
- Advertisement -

ముంబై : రాజకీయాల్లో కాదేదీ అసాధ్యం అనే విషయాన్ని రుజువు చేస్తూ మహారాష్ట్రలో ఎన్‌సిపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్‌ను రెబెల్ వర్గం అధినేత అజిత్ పవార్ తొలిగించారు. తమదే అసలు సిసలైన ఎన్‌సిపి అని పార్టీ ఎమ్మెల్లేల బలం సంతరించుకున్న తరువాత బుధవారం ఇక్కడ అజిత్ పవార్ ప్రకటించారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని స్థాపించి, రెండు దశాబ్దాలకు పైగా తిరుగులేకుండా చక్రం తిప్పిన శరద్ పవార్ , జాతీయ రాజకీయాలలో అత్యంత కీలకమైన దశలో అబ్బాయి అంటే సొంత అన్న కొడుకు అజిత్ పవార్ ద్వారా పార్టీ నుంచి తొలిగించివేయబడ్డారు. తమకు పార్టీలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల బలం ఉందని, తమదే అసలు సిసలు ఎన్‌సిపి అని, ఎన్‌సిపి పేరు , ఎన్నికల చిహ్నం గడియారం తమకే దక్కాలని ఎన్నికల సంఘానికి బుధవారమే అజిత్ పవార్ వర్గం లేఖ పంపించింది.

తమ వర్గానికే ఎన్‌సిపిగా గుర్తింపు ఇవ్వాలని కోరడంతో మహారాష్ట్ర రాజకీయాలలో పరిస్థితి తీవ్రస్థాయికి దారితీసింది. రాష్ట్రంలోని షిండే వర్గపు శివసేన, బిజెపిల కాంబినేషన్‌లోని ప్రభుత్వంలో అజిత్ పవార్ తొమ్మండుగురు ఎమ్మెల్యేలతో చేరడం, ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు దక్కడం, తాను ఉప ముఖ్యమంత్రి కావడం తరువాత ఎన్‌సిపిలో తీవ్రసంక్షోభం చివరికి శరద్ పవార్ చిరకాల అధినాయకత్వానికి ఎసరు తెచ్చి పెట్టింది. పార్టీలో తమకు 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన బలం ఉందని తెలిపే అఫిడవిట్లను అజిత్ వర్గం ఎన్నికల సంఘానికి హుటాహుటిన పంపించింది.
బాబాయి… నీది రిటైర్ కావల్సిన వయస్సు
32 మంది ఎమ్మెల్యేలు తోడుగా అజిత్ హితవు
బుధవారం అజిత్ పవార్ తన బల ప్రదర్శనకు దిగారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసితనదే ఎన్‌సిపి అని తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 53 మంది ఎన్‌సిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో బుధవారం విలేకరుల సమావేశానికి అజిత్ చుట్టూ 32 మంది ఎన్‌సిపి ఎమ్మెల్యేలు నిలబడ్డారు. బలం తమదే అని, ఇక బాబాయ్ శరద్ పవార్ జీ ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం మంచిదని ఈ దశలో అజిత్ పవార్ తెలిపారు. బిజెపిలో నేతలు 75 ఏళ్లకు రిటైర్ అవుతున్నారని, మరి మీరు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటారని పవార్‌ను ఉద్ధేశించి చెప్పారు. ముంబై శివార్లలోని బాంద్రాలో ఆయన తనకు మద్దతు పలికే ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి గేమ్ ఉంటుంది. ఇన్నింగ్స్‌కు పరిమితి ఉంటుంది.

సాధారణంగా 25 నుంచి 75 ఏండ్ల వరకూ మనిషి జీవితంలో సరైన ఫలితాలు కనబర్చే వయస్సుగా ఉంటుందని 63 ఏండ్ల అజిత్ పవార్ సీనియర్ పవార్‌కు పరోక్షంగా విన్నవించుకున్నారు. మహారాష్ట్రకు ఎన్‌సిపి తరఫున సిఎం వచ్చే అవకాశాన్ని 2004లో శరద్ పవార్ చేజార్చారని మండిపడ్డారు. అప్పట్లో కాంగ్రెస్ కన్నా ఎస్‌పిపికే ఎక్కువ సంఖ్యాబలం ఉందన్నారు. అయితే అప్పట్లో ఈ మహానుభావుడు (శరద్ పవార్) చేతలతో కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కిందని గుర్తు చేశారు. షిండే బిజెపితో చేతుల కలపడానికి ముందే ఎన్‌సిపి ఈ పనిచేస్తే బాగుంటుందని పార్టీలో అత్యధికులం పవార్‌కు సూచించామని , అయితే ఆయన పట్టించుకోలేదని , తరువాతి దశలో ఏక్‌నాథ్ షిండే ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసి ఏకంగా సిఎం అయ్యారని తెలిపారు. తనకైతే ఇప్పటికీ మహారాష్ట్రకు సిఎం కావాలనేతే లక్షం అని ఇప్పుడు డిప్యూటి సిఎం అయిన అజిత్ పవార్ తెలిపారు.
అద్వానీ, జోషీల రిటైర్ సంతి మరిచారా?
సాధారణంగా మన దేశంలో రాజకీయాలలో సీనియర్లు రిటైర్మెంటు తీసుకుంటారు, బిజెపి సంగతి తీసుకుంటే సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీల గురించి తెలియదా. బిజెపిలో నేతలు 75 ఏండ్లకు ఇంటిపట్టుకు వెళ్లుతున్నారు. ఐఎఎస్‌లు 60 ఏండ్లు రాగానే రిటైర్ కావల్సిందే . మరి 83 ఏండ్లు వచ్చిన శరద్ పవార్‌కు ఇంక ఎంత కాలం పార్టీలో చలామణి సాగిస్తారు. మీరు ఎప్పుడు ఆగుతారు? మీరు మాకు ఆశీస్సులు ఇస్తే మేం మీ సంపూర్ణ జీవితానికి ప్రార్థిస్తామని తెలిపారు. తమకు సాహెబ్ (శరద్ పవార్) దేవుడు వంటివారే. ఆయన పట్ల తమకు అపార గౌరవం ఉందన్న అజిత్ పవార్. ఎవరైనా కూడా రాజకీయాల్లో కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుందన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News