Friday, December 20, 2024

ఏ పదవీ ఆఫర్ లేదు..బిజెపితో వెళ్లేది లేదు

- Advertisement -
- Advertisement -

ముంబై : తనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే ఆశ చూపారనే వార్తలను ఎన్‌సిపి నేత శరద్ పవార్ తోసిపుచ్చారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని బుధవారం ఆయన స్పష్టం చేశారు. పార్టీలో సీనియర్ మోస్ట్ అయిన తన ముందుకు ఎవరు పదవి ప్రతిపాదన తెస్తారని ప్రశ్నించారు. బిజెపితో వెళ్లేది లేదు. 2024లో రాజకీయ రంగంలో మార్పు కోసం అవిశ్రాంతంగా పాటుపడుతానని తెలిపారు. ఇటీవల శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య రహస్య సమావేశం జరిగింది. దీనిపై రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమిలో ఈ పరిణామం తీవ్రస్థాయిలో గందరగోళానికి దారితీసింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత శరద్ పవార్ స్పందించారు. కొత్తగా ఏర్పాటు అయిన ఇండియా ప్రతిపక్ష కూటమికి దూరమై, బిజెపితో కలిసి సాగితే ఇందుకు ప్రతిగా కేంద్రంలో కేబినెట్ పదవిని పవార్‌కు ఇచ్చేందుకు ఆఫర్ వచ్చిందని వార్తలు వెలువడ్డాయి.

పుణేలో ఓ వ్యాపారవేత్త నివాసంలో అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య కీలక సమావేశం జరిగిది. అజిత్ పవార్ వర్గపు ఎమ్మెల్యేలు కొందరు మహారాష్ట్రలో బిజెపి, శివసేన (షిండే) కలయికలోని రాష్ట్ర మంత్రి మండలిలో మంత్రులుగా చేరారు. దీనితో ఎన్‌సిపిలో చీలిక ఏర్పడింది. దీని ప్రభావం ప్రతిపక్ష కూటమిపై పడింది. సీనియర్ నేత అయిన తన బాబాయ్ శరద్ పవార్‌ను బుజ్జగించేందుకు, బిజెపికి సానుకూలంగా ఆయన ఉండేలా చేసేందుకు అజిత్ పవార్ కేంద్రంలోని బిజెపి తరఫున పవార్‌ను కలిసినట్లు వార్తలు వెలువడ్డాయి. త్వరలోనే శరద్ పవార్ కేంద్ర సీనియర్ మంత్రి అవుతారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ చెప్పడం ఇండియా కూటమిలో అయోమయం ఏర్పడింది. అయితే మాజీ సిఎం చెప్పిన దాని గురించి తనకు ఏమీ తెలియదని, దీనిపై ఎటువంటి చర్చ జరగలేదని, అయితే సమావేశం జరగలేదని తాను చెప్పడం లేదని, ఓ కుటుంబ పెద్దగా తాను అందరితో మాట్లాడటం జరుగుతుందని, ఈ దశలో తలెత్తే వదంతులపై తానేమీ చెప్పలేనని పవార్ జవాబు ఇచ్చారు.

బిజెపివి చీల్చుడు రాజకీయాలు ః శరద్
బిజెపికి ఆది నుంచి విభజించి పాలించే తత్వం ఒంటబట్టిందని సీనియర్ నేత శరద్ పవార్ తెలిపారు. పలు విషయాలలో ప్రజలను విడగొట్టడం నేర్చుకున్నారని విమర్శించారు. సమాజం అత్యంత సున్నితమైన రీతిలో కలయికగా ఉంటుంది. అయితే దీనిని దెబ్బతీసే విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇటీవల సిబిఎస్‌ఇ కొత్త సిలబస్ గురించి కేంద్రం వెలువరించిన సర్కులర్ ఇందుకు ఉదాహరణ అయిందని శరద్ పవార్ చెప్పారు. ఆగస్టు 14వ తేదీని దేశవిభజన దారుణ ఘటనల సంస్మరణ దినంగా పాటిస్తారని ఇందులో తెలిపారు. ముంబైలో ఇండియా కూటమి తదుపరి సమావేశంఈ నెల 31వ తేదీన జరుగనుంది.

తరువాత బహిరంగ సభ తరువాతి రోజు ఉంటుంది. ఇండియా కూటమి అనుకున్నట్లుగా ముంబైలోనే ఆగస్టు 31న జరుగుతుందని శరద్ పవార్ స్పష్టం చేశారు. ప్రజలతో ఎన్నికైన ప్రతిపక్ష ప్రభుత్వాలను అస్థిరపర్చడానికి తరచూ యత్నించిందని పేర్కొన్న పవార్ గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ విధంగా పలు ఉదాహరణలను తీసుకోవచ్చునని తెలిపారు. మణిపూర్ పరిస్థితి దిగజారుతోందని , అక్కడ ఘర్షణలు చెలరేగి 99 రోజులు అయింది. కానీ దీనిపై ఆయన పార్లమెంట్ వెలుపల కేవలం 3 నిమిషాలు మాట్లాడారు. కాగా అవిశ్వాస తీర్మానంపై చర్చ దశలో పార్లమెంట్‌లో ఐదు నిమిషాలు ప్రస్తావించారని పవార్ విమర్శించారు.

మహారాష్ట్ర రాజకీయ భీష్మపితామహులు దారితప్పరనే ఆశ
అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య భేటీ మహారాష్ట్రలోని ఎన్‌సిపి, కాంగ్రెస్ , ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీల మిత్రపక్ష కూటమిలో చిచ్చురేపింది. ఉద్ధవ్ థాకరే సన్నిహితులు, ఎంపి అయిన సంజయ్ రౌత్ ఈ విషయంపై మాట్లాడారు. మహారాష్ట్ర రాజకీయాలలో శరద్ పవార్ భీష్మపితామహులు వంటి వారని, ఆయన ప్రజల మనస్సులలో అనుమానాలు రేకెత్తే విధంగా వ్యవహరించరాదని సూచించారు. శరద్ పవార్ తన జీవితకాలంలో బిజెపితో కలిసివెళ్లే పనికి దిగబోరని రౌత్ చెప్పారు. ఇప్పుడు ఆయన తన పార్టీ బలోపేతానికి తిరుగుతున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News