Monday, January 20, 2025

రాజీనామా వెనక్కు తీసుకున్న పవార్

- Advertisement -
- Advertisement -

ముంబై : నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను శరద్ పవార్ వెనక్కు తీసుకున్నారు. పలు విషయాలను పరిగణనలోకి తీసుకుని , తనకు అందిన అసంఖ్యాక అభ్యర్థనల క్రమంలో తాను రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు, ఇంతకు ముందటిలాగానే పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నట్లు 82 సంవత్సరాల వయోవృద్ధ నేత పవార్ శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. కాగా అంతకు ముందు శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పార్టీ శిబిరంలో పెద్ద ఎత్తున సందడి నెలకొంది. పవార్ తరువాతి నేత ఎంపికకు ఏర్పాటు అయిన కమిటీ కీలక సమావేశం జరిపింది. తర్జనభర్జనల తరువాత ఈ కమిటీ తాము పవార్ రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. పవారే తిరిగి పార్టీ అధ్యక్షులుగా కొనసాగాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం వెలువరించారు. తన వారసుడిని ఎంచుకునేందుకు పవారే స్వయంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

ఇందులో అజిత్ పవార్, సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ సభ్యులుగా ఉన్నారు, తాము పవార్‌ను కలుస్తామని, కమిటీ వెలువరించిన తీర్మానం ఆయనకు అందించి , నేతగా కొనసాగాలని కోరుతామని అంతకు ముందు కమిటీ తరఫున ప్రఫుల్ పటేల్ తెలిపారు. ఇది జరిగిన కొద్ది సేపటికి పవార్ విలేకరులతో మాట్లాడుతూ రాజీనామాను వెనకకు తీసుకుంటున్నట్లు, పదవిలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీనితో ఈ నెల 2న పవార్ రాజీనామా నిర్ణయంతో తలెత్తిన ఎన్‌సిపి టీ కప్పు తుపాన్ పరిస్థితి సద్దుమణిగింది. ఎన్‌సిపి అంటేనే పవార్ పవార్ అంటేనే ఎన్‌సిపి అనుకుంటూ సాగిన రాజకీయ పార్టీలో ఆయన రాజీనామా నాటకీయం అయింది. ఇప్పుడు దీనిని వెనకకు తీసుకోవడం కూడా అంతే ఉత్కంఠభరితం అయింది. తాను ఇప్పటికైతే పార్టీ నేతగా కొనసాగాలని నిర్ణయించుకున్నప్పటికీ అయితే తన రాజకీయ వారసత్వం ఆలోచనలు ఉండనే ఉన్నాయని పవార్ తెలిపారు. పార్టీ అధ్యక్ష స్థానంలో చిరకాలం తాను ఉండటం సబబు కాదని, ఇక్కడ వేరే నేత రావల్సి ఉంటుంది.

అయితే తాను పార్టీలో బాధ్యతాయుతమైన ఏదో ఒక పదవిలో ఉంటాను. ఇది పార్టీ నిర్మాణ ప్రక్రియ దశలో ఉండే బాధ్యత అయి ఉంటుందని, తానే కలకాలం ఈ పదవిలో ఉండాలనే ఆలోచన తనకు లేదని, ఇతరులకు ఉండటం కూడా కష్టమే అని పవార్ తెలిపారు. తాను పార్టీలో వ్యవస్థాగత మార్పుల కోసం పాటుపడుతాను, పాతతరం మరీ ఇంతగా పాతుకుపోతూ ఉండటం పాడికాదన్న పవార్ , ఏ పార్టీలో అయినా నూతన నాయకత్వం సృష్టి అవసరం అని, దీనితోనే పార్టీ ముందుకు సాగుతుందన్నారు. పాత తరం వెళ్లి కొత్త తరం వస్తేనే పార్టీ నిరంతరం సాగుతుందన్నారు. ఎన్‌సిపికి ఉన్న లక్షాలు ఆశయాలను ప్రజల వద్దకు మరింత బలీయంగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. పార్టీ కేవలం మరాఠా ప్రాబల్యపు పార్టీగానే కాకుండా విస్తృత ప్రాతిపదికన నిలిచే పార్టీ కావల్సి ఉంటుందని తెలిపారు.

ఇందుకోసం తాను మరింత శక్తియుతంగా కాకపోయినా ఇనుమడించిన ఉత్సాహంతో పనిచేస్తానని పార్టీ కీలక సమావేశం దశలో పవార్ తెలిపారు. పవార్ తిరిగి నేతగా ఉండేందుకు అంగీకరించారని తెలియడంతో పార్టీ కార్యాలయం వెలుపల కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి, కేరింతలు కొడుతూ సంబరాలకు దిగారు. సాహెబ్ (పవార్) తమ తిరుగులేని నేత అని పలువురు కార్యకర్తలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News