సిసిఎస్‌లో ఫిర్యాదు ఉపసంహరించుకున్న శరణ్
మనతెలంగాణ, సిటిబ్యూరో: ఛీటింగ్ కేసులో సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌కు ఊరట లభించింది. బెల్లంకొండ సురేష్, ఆయన కుమారుడు సాయిశ్రీనివాస్‌కు ఫైనాన్షియర్ శరణ్ కుమార్ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది. సినీ నిర్మాణం పేరుతో బెల్లంకొండ సురేష్ తనవద్ద రూ.85లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఫైనాన్షియర్ శరణ్ నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదం పెద్దది కావడంతో సినీ పెద్దలు జోక్యం చేసుకుని రాజీకుదిర్చినట్టు తెలిసింది. దీంతో కేసు వాపసు తీసుకోవడానికి సిసిఎస్‌కు శరణ్ కుమార్ వచ్చారు. సురేష్,సాయిశ్రీనివాస్‌పై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఇద్దరిని క్షమాపణలు కోరుతున్నానని, పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగిందని తెలిపారు. తమ అకౌంట్స్ సిబ్బంది, బెల్లంకొండ మేనేజర్స్ మధ్య సమాచార లోపం వల్ల వివాదం నెలకొందని తెలిపారు. తనకు రావాల్సిన డబ్బుల్లో కొంత ఇచ్చారని తెలిపారు.