‘ఖేల్ రత్న’ శరత్ కమల్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్, టిటి ప్లేయర్ శ్రీజ ఆకుల
షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్షసేన్‌కు అర్జున పురస్కారాలు
30న విజేతలకు అవార్డులు అందజేయనున్న రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: యువజన వ్యవహారాలు, క్రీడామంత్రిత్వశాఖ సోమవారం క్రీడా పురస్కారాలను ప్రకటించింది. టేబుల్ టెన్నిస్ వెటరన్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్‌ను ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న 2022 పురస్కారం వరించింది. తెలుగుతేజం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరిన్‌తోపాటు బాక్సర్ అమిత్ పంగాల్, షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్షసేన తదితరులు అర్జున పురస్కార విజేతలుగా నిలిచారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తోపాటు కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో నిఖత్ బంగారు పతకాలతో మెరిసింది. థామస్ కప్ విజయంలో ప్రణయ్, లక్షసేన్ కీలకపాత్ర పోషించారు.
కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రతిభ చూపిన శరత్‌కు మాత్రమే ఈ ఏడాది మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారం లభించింది. మొత్తం 25మంది అథ్లెట్లకు అర్జున అవార్డులను కేంద్రం ప్రకటించింది. అర్జున పురస్కార విజేతల్లో అథ్లెటిక్స్‌లో సీమా పునియా, అవినాష్ ముకుంద్ సాబ్లి, బ్యాడ్మింటన్‌లో ప్రణయ్, లక్షసేన్, బాక్సింగ్‌లో నిఖత్ జరీన్, అమిత్, చదరంగంలో భక్తి ప్రదీప్ కులకర్ణి, ప్రజ్ఞానంద, జుడోలో సుశీలాదేవి, టేబుల్ టెన్నిస్‌లో శ్రీజ ఆకుల, పారాబ్యాడ్మింటన్ ప్లేయర్లు మానసి, తరుణ్ తదితరులు ఉన్నారు. ద్రోణాచర్య అవార్డు బాక్సింగ్‌లో మహ్మద్ అలీ ఖమర్, ఆర్చరీ జీవన్ జ్యోత్‌సింగ్ తేజ, పారాషూటింగ్ సుమ సిద్ధార్థ్, రెజ్లింగ్ సుజిత్‌మాన్ సహా నలుగురికి పురస్కారాలను ప్రకటించారు. అదేవిధంగా ద్రోణాచార్య జీవితకాల పురస్కారాలు ముగ్గురికి, ధ్యాన్‌చంద్ జీవితకాల పురస్కారం నలుగురికి ప్రకటించారు. పురస్కార విజేతలకు రాష్ట్రపతి భవన్‌లో ఈ నెల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేయనున్నారు.
Sharath Kamal to receive Khel Ratna on Nov 30