Wednesday, January 22, 2025

శార్దూల్ మెరుపు శతకం

- Advertisement -
- Advertisement -

ముంబై: తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. జవాబుగా మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ముంబై ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. 45/2 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. మోహిత్ అవస్థి 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ అజింక్య రహానె కూడా నిరాశ పరిచాడు. రహానె 19 పరుగులు మాత్రమే చేశాడు. శ్రేయస్ అయ్యర్ కూడా విఫలమయ్యాడు. అయ్యర్ 3 పరుగులే సాధించాడు. మరోవైపు షమ్స్ ములానీ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ముషీర్ ఖాన్ ఆరు ఫోర్లతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. తమిళనాడు కెప్టెన్ సాయి కిశోర్ వెంటవెంటనే వికెట్లు తీసి ముంబైని దెబ్బతీశాడు.

అతని దెబ్బకు ముంబై 106 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను శార్దూల్ ఠాకూర్ తనపై వేసుకున్నాడు. అతనికి వికెట్ కీపర్ హార్దిక్ తామోర్ (35) అండగా నిలిచాడు. అతనితో కలిసి శార్దూల్ స్కోరును ముందుకు నడిపించాడు. ఇద్దరు కలిసి 8వ వికెట్‌కు 105 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన తనూష్ కొటియాన్ కూడా మెరుగైన బ్యాటింగ్‌తో అలరించాడు. మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్ 104 బంతుల్లోనే 4 సిక్సర్లు, 13 ఫోర్లతో 109 పరుగులు సాధించాడు. తనూష్ కొటియాన్ 10 ఫోర్లతో 74 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనికి తుషార్ దేశ్‌పాండే (17) బ్యాటింగ్ సహకారం అందిస్తున్నాడు. తమిళనాడు బౌలర్లలో సాయి కిశోర్ ఆరు, కుల్దీప్ సేన్ రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ముంబైకి ఇప్పటికే 207 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News