ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ లేఖ
న్యూఢిలీ: కొవిడ్-19 విపత్కాలంలో కష్టాలలో ఉన్న ఆయా నియోజకవర్గాలలోని ప్రజలకు అందచేసిన సహాయ సహకారాల గురించి తెలియచేయవలసిందిగా పార్లమెంట్ సభ్యులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఎదురైనపుడు జాతీయ స్థాయిలో వాటిని అధిగమించడానికి చేపట్టవలసిన ఉత్తమ విధానాల రూపకల్సనకు మీ అనుభవాలు దోహదపడతాయని ఎంపీలకు రాసిన లేఖలో ఓం బిర్లా తెలిపారు.
ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు వారి ప్రతినిధులుగా అండగా నిలచి, సహాయపడాల్సిన బాధ్యత పార్లమెంట్ సభ్యులుగా మీపైన ఉందని ఆ లేఖలో స్పీకర్ అభిప్రాయపడ్డారు. కష్ట కాలంలో ఉన్న ప్రజలకు సహాయపడడంలోనే అత్యధిక సమయాన్ని మీరు వెచ్చించి ఉంటారని తాను భావిస్తున్నానని ఎంపీలకు ఉద్దేశించి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రజలకు నైతిక స్థైర్యాన్ని కల్పించడంతోపాటు వారి సమస్యలను తీర్చడానికి శాయశక్తులా మీరు కృషి చేసి ఉంటారని స్పీకర్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని కోట నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఓం బిర్లా తన నియోజకవర్గంలో మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను లేదా కుటుంబ పెద్దను కోల్పోయిన పక్షంలో వారికి ఉచిత కోచింగ్, వసతి సౌకర్యాన్ని తన సొంత ఖర్చుతో సమకూరుస్తానని ఇప్పటికే ప్రకటించారు.