అమరావతి: వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపి విజయ సాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. జగన్ వల్ల ఇబ్బందులు పడ్డామని విజయసాయిరెడ్డి చెప్పానన్నారు. ‘నా పిల్లలకు సంబంధించిన విషయమే నేను చెబుతాను. షేర్లు జగన్ కే చెందాలంటూ నాపై కేసు వేశారు, నా మాటలు అబద్ధాలని విజయసాయిరెడ్డితో జగనే చెప్పించారు’ అని ఆరోపణలు చేశారు. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాటలు అసత్యమని విజయమ్మే చెప్పారని మండిపడ్డారు. ఆ తర్వాత కూడా విజయ సాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని, విజయసాయిరెడ్డి అంగీకరించుకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారని షర్మిల తెలియజేశారు. మళ్లీ విజయసాయిరెడ్డిని జగన్ పిలిపించి, ఆయనకు 40 నిమిషాలు జగన్ స్వయంగా డిక్టేట్ చేశారని షర్మిల వెల్లడించారు.
ఎలా చెప్పాలి, తనపై ఏం మాట్లాడలో జగనే మొత్తం వివరించారని పేర్కొన్నారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డి తనకు స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి చెప్పినవి విన్నాక కన్నీళ్లు వచ్చాయని బాధను వ్యక్తం చేశారు. తోడబుట్టిన చెల్లెలని కూడా చూడకుండా జగన్ దిగజారిపోయారని దుయ్యబట్టారు. తన వ్యక్తతుత్వంపై పలువురితో నీచంగా మాట్లాడించారని, జగన్ ఇటీవల వ్యక్తిత్వం గురించి పెద్ద డైలాగులు చెప్పారని, అసలు క్యారెక్టర్ అంటే ఏమిటో జగన్ మరచిపోయారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కోరికకు భిన్నంగా అబద్ధం ఆడాలని విజయసాయి రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చారని, పరువు పోతుందని విజయ సాయిరెడ్డి చెప్పినా జగన్ ఊరుకోలేదన్నారు. జగన్ చెప్పిన అబద్దాలను విజయసాయి రాసుకొని విమర్శలు చేశారన్నారు.