మనతెలంగాణ/ హైదరాబాద్: వైఎస్సార్ టి.పి. నాయకురాలు షర్మిల రైతు బీమా విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. షర్మిల.. ముందుగా వాస్తవాలు తెలుసుకుని.. ఆ తర్వాత రైతుబీమా విషయంపై మాట్లాడాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు, రైతుబీమా కార్యక్రమాలు విజయవంతంగా రాష్ట్రంలో అమలు అవుతున్నాయని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రైతుబీమా విషయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసిని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఒప్పించి అమలు చేస్తున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసి, జనరల్ ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం 60 ఏళ్ల లోపు ఉన్న వారికే బీమా సౌకర్యం ఉందని, ఆ నిబంధనల ప్రకారమే రైతు బీమా పాలసీ చేయించామని ఆయన అన్నారు. కేంద్ర, పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఇన్సూరెన్స్ సహా వివిధ పథకాలు 60 ఏళ్ల లోపు ఉన్న వారికే వర్తిస్తున్నాయని, ఈ విషయం మీకు తెలియదా..? అని ఆయన షర్మిలను ఆయన ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఇలాంటి పథకాలను షర్మిల మెచ్చుకోవాల్సింది పోయి విమర్శలు చేస్తే ఎలా అని ఆయన అన్నారు.