Saturday, November 23, 2024

శశిథరూర్‌ను గాడిద అన్న పిసిసి ‘చీప్’

- Advertisement -
- Advertisement -

Shashi Tharoor a donkey Says Revanth Reddy

ఐటి స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా థరూర్ తెలంగాణను మెచ్చుకున్నారు,
ప్రశంసలు కురిపించారు, రేవంత్ ఆయనను గాడిద అన్నారు, అతడో థర్డ్ రేట్ క్రిమినల్, ఇలాంటి నీచత్వాన్ని ఎండగట్టాల్సిందే
ఒక పార్టీకి మూర్ఖులు సారథ్యం వహిస్తే ఇలాగే ఉంటుంది : కెటిఆర్
కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ సూచనతో వ్యాఖ్య వెనక్కి తీసుకున్న రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్:  రాజకీయాల్లో ఇలాంటి నీచత్వాన్ని చెత్తను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. శశిథరూర్ గాడిద అన్న రేవంత్ మాటలపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిపై రాష్ట్ర మంత్రి కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ఆయన ఓ థర్డ్ రేట్ క్రిమినల్ అని ఆరోపించారు. ఒక పార్టీకి మూర్ఖులు సారథ్యం వహిస్తే ఇలాగే ఉంటుందని ట్విట్టర్‌లో ఓ ఘటనను ప్రస్తావించారు. రేవంత్‌రెడ్డిని టిపిసిసి ‘చీప్’ అని పేర్కొంటూ విమర్శలు చేశారు. ఐటి స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా శశిథరూర్ తెలంగాణ ప్రభుత్వ కృషిని మెచ్చుకున్నారని, ప్రభుత్వంపై పొగడ్తలు కురిపించారని కెటిఆర్ ట్వీట్ చేశారు. కానీ పార్లమెంటులో ఆయన తోటి సభ్యుడు, పిసిసి ’చీప్’ ఆయనను గాడిద అని పేర్కొన్నారని ఓ న్యూస్ క్లిప్‌ని జతచేశారు. కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ ఇటీవలే హైదరాబాద్ పర్యటించారు.

కెటిఆర్ కృషిని ప్రశంసించారు. ఆయన పర్యటనపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే శశిథరూర్ పర్యటనను రేవంత్‌రెడ్డి ముందు ప్రస్తావించగా మండిపడినట్లు ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం శశిథరూర్, కెటిఆర్ ఇద్దరూ ఒకే దుష్టజట్టు అని రేవంత్ విమర్శించారు. ఇరువురికీ ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్నంత మాత్రాన మేధావులని భావించనక్కర్లేదని అన్నారు. శశిథరూర్ ఒక గాడిద అని, కాంగ్రెస్ ఆయనను బహిష్కరిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సొంత పార్టీ ఎంపి, ఐటీ స్థాయీ సంఘం చైర్మన్ శశిథరూర్‌నే టిపిసిసి చీఫ్, ఎంపి రేవంత్‌రెడ్డి విమర్శించడాన్ని కెటిఆర్ ఇక్కడ ప్రస్తావించారు. ఇలాంటి థర్డ్ రేట్ క్రిమినల్ పార్టీకి సారథ్యం వహిస్తే ఇలాగే ఉంటుందని విమర్శించారు. ఫోరెన్సిక్ పరీక్షకు పంపితే ఓటుకు నోటు కేసులో దొరికిన ఆడియోతో ఇది సరిపోతుందని కెటిఆర్ ఆన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ ఏమైనా స్పందిస్తారా? అని ప్రశ్నించారు.

రేవంత్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతల చురకలు…

రేవంత్ ఆయన మూలాలను గుర్తించుకొని గాడిద అనే మాట మాట్లాడారేమోనన్న శశిధరూర్ రేవంత్‌రెడ్డి సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత పైన నోరు పారేసుకోవడంపై అటు రాష్ట్రంలోని పలువురితో పాటు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ సీనియర్ నేతలు చురకలు అంటిస్తున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేత, అధిష్టానానికి అత్యంత దగ్గరైన మనీష్ తివారి రేవంత్‌రెడ్డికి గట్టిగానే బుద్ధిచెప్పారు. శశిథరూర్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడని, ఆయన నీకు, నాకు అలాగే అందరికీ అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి అన్నారు. వెంటనే రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. మరోవైపు శశిథరూర్ సై తం తనదైన శైలిలో స్పందించారు. బహుశా రేవంత్‌రెడ్డి ఆయన మూ లాలను గుర్తించుకొని గాడిద అనే మాట అన్నారేమో అని స్పందించారు. తాము ప్రచురించిన వార్తా కథనంలోని ఏ మాత్రం అవాస్తవం లేదని తమ వద్ద కచ్చితమైన ఆధారం ఉందని, తమ వార్తా కథనానికి కట్టుబడి ఉన్నామని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తెలిపింది. మరోవైపు వందలాది మంది శశిథరూర్ అభిమానులు రేవంత్‌రెడ్డి గత చరిత్రను, కేసులను ఎత్తిచూపుతూ ట్వీట్లు చేస్తున్నారు.

వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న రేవంత్

తాను మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ మేరకు శశిథరూర్‌తో మాట్లాడానని తెలిపారు. శశిథరూర్‌పై తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానన్నారు. తాము కాంగ్రెస్ పార్టీ విలువలు, విధానాలపై విశ్వాసాలకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి తనపై పొరపాటున చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తూ తనకు ఫోన్ చేయడాన్ని శశిథరూర్ స్వాగతించారు. ఈ దురదృష్టకర ఎపిసోడ్‌కు ఇంతటితో ముగింపు పలుకుతున్నామన్నారు. ఇకపై తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతానికి కలి సికట్టుగా కృషి చేస్తామని శశిథరూర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News