సెప్టెంబర్ 22న రాహుల్ ఢిల్లీకి చేరుకోనున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోటీపడుతుండగా, ఆయనకు పోటీగా శశిథరూర్ కూడా ఆ పదవికి పోటీపడుతున్నారు. కాగా పోటీని కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వాగతించారు. సోనియా గాంధీ మొదట పార్టీకి సారథ్యం వహించమని అశోక్ గెహ్లాట్ ను కోరినప్పటికీ, రాజస్థాన్ లో ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని, ఆయన స్థానాన్ని ఆయనకు బద్ధ శత్రువైన సచిన్ పైలట్ కు ఇవ్వరాదన్న అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది. మరోవైపు అశోక్ గెహ్లాట్, ముకుల్ వాస్నిక్ పార్టీకి రాహుల్ గాంధీయే నాయకత్వం వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ తన అయిష్టతను ఇప్పటికీ వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం ‘భారత్ జోడో యాత్ర’ ను నిర్వహిస్తున్నారు. అయితే ఆయన కేరళ నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకుగాను విమానంలో ఢిల్లీకి సెప్టెంబర్ 22కల్లా చేరుకుంటారని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలని, ఎవరైనా నామినేషన్ వేసేలా వీలుకల్పించాలని సోనియా గాంధీ కేంద్ర ఎన్నికల కమిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీని ఆదేశించారు.