న్యూఢిల్లీ: తాజాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసించడమే కాక.. కేంద్ర మంత్రి పియూష్ గోయెల్‌తో ఆయన సెల్ఫీ దిగి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరుతారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై శశిథరూర్ క్లారిటీ ఇచ్చారు.
తాను కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి తన అవసరం ఉన్నంత వరకూ అందులో కొనసాగుతానని, అవసరం లేని సమయంలో తనకు వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, కానీ, వేరే పార్టీలో చేరే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో తనను కొంతమంది వ్యతిరేకిస్తున్నారని.. కానీ తనకు దేశం, కేరళ భవిష్యత్తు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పటికి కాంగ్రెస్‌కు విధేయుడినని అన్నారు. తాను ఐక్యరాజ్యసమితిలో దౌత్యవేత్తగా ఉన్నప్పుడు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.