Monday, December 23, 2024

కాంగ్రెస్ అధ్యక్ష రేసులో శశిథరూర్!

- Advertisement -
- Advertisement -

Shashi Tharoor in Congress presidential race!

మలయాళం పత్రిక ‘ మాతృభూమి’లో వ్యాసంతో ఊపందుకున్న ఊహాగానాలు
స్వేచ్ఛగా, పారదర్శకంగా అధ్యక్ష ఎన్నికలు జరగాలని ఆ ఆర్టికల్‌లో ఎంపి డిమాండ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వచ్చే అక్టోబర్ 17న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సిద్ధమవుతుండడంతో జి 23గా పిలవబడే అసమ్మతి నేతల్లో ఒకరైన ఆ పార్టీ ఎంపి శశిథరూర్ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పోటీకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం.తాజాగా మలయాళం దినపత్రి ‘మాతృభూమి’లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలను ప్రస్తావిస్తూ శశిథరూర్ ‘ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్’ పేరుతో ఒక ఆర్టికల్ రాశారు. అందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికతో పాటుగా సిడబ్లుసి సభ్యుల ఎన్నికను నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి ఎక్కువ కాలం కొనసాగడం మంచిది కాదని కూడా అభిప్రాయపడ్డారు. దీంతో అధ్యక్ష పదవికి రేసులో శశిథరూర్ కూడా ఉండబోతున్నారంటూ మంగళవారం ఉదయంనుంచి ప్రచారం మొదలైంది. అయితే దీనిపై శశిథరూర్ నేరుగా ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.

కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడంతో పార్టీకి కొత్త జవసత్వాలను అందించే దిశగా తొలి అడుగుపడినట్లవుతుందని ఆయన ఆ ఆర్టికల్‌లో అభిప్రాయపడ్డారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అధ్యక్ష పదవికి కొనసాగుతున్న పోటీని బ్రిటీష్ కన్సర్వేటివ్ పార్టీలో నాయకత్వం కోసం జరిగే పోటీతో శశిథరూర్ పోలుస్తూ, దీనివల్ల పార్టీ పట్ల జాతీయ స్థాయిలో ఆసక్తి పెరుగుతుందని, మరోసారి పార్టీ పట్ల ఎక్కువ మంది ఆకర్షితులు కావడం ద్వారా పార్టీకి కొత్త జవసత్వాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. కాగా ప్రచారంపై మీడియా శశిథరూర్‌ను ప్రశ్నించగా..సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారా లేదా అనేవిషయంలో ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఆ విషయంతో తానేమీ మాట్లాడనని చెప్పారు. అయితే స్వేచ్ఛగా, పారదర్శకంగా అధ్యక్ష ఎన్నికలు జరగాలంటూ ఆర్టికల్‌లో పేర్కొన్న తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నాని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టడానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా సుముఖంగా లేకపోవడంతో గాంధీయేతర కుటుంబాలకు చెందిన వ్యక్తి పార్టీ అధ్యక్షుడవుతారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ రేసులో ముందున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News